పాఠశాలల నిర్వహణకు రూ.80.81 లక్షల గ్రాంట్
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఆదర్శ పాఠశాలలకు 2026–27 విద్యా సంవత్సరానికి స్కూల్ ఫెసిలిటీ అండ్ మెయింటెనెన్స్ (School Facilities and Maintenance) గ్రాంట్ కింద రూ.80.81 లక్షలు విడుదల చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా విద్యాధికారి పి. చంద్రయ్య (District Educational Officer P. Chandrayya) తెలిపారు. జూన్ 15 రోజులు, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన నిధులు రెండు రోజుల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ (AAPC) ఖాతాల్లో జమ కానున్నట్లు పేర్కొన్నారు.
ఈ నిధులను పాఠశాలల్లో తరగతి గదులు, ఆవరణ, శౌచాలయాల పరిశుభ్రతతో పాటు నిర్వహణ సిబ్బందికి గౌరవ వేతనం చెల్లించేందుకు వినియోగించాలని సూచించారు. సిబ్బంది మొక్కల పెంపకం బాధ్యతలను కూడా చేపట్టాలని తెలిపారు. కమిటీలు వెంటనే చెక్కుల ద్వారా గౌరవ వేతనాలు చెల్లించి, ప్రధానోపాధ్యాయులు యుటిలైజేషన్ సర్టిఫికెట్లను మండల విద్యాధికారులకు సమర్పించాలని ఆదేశించారు.
పాఠశాలల్లో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్ఎఫ్ఎంజి నిధులు జిల్లాలకు మంజూరు కానప్పటికీ, విద్యార్థుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్‌కు జిల్లా విద్యాశాఖ తరఫున డీఈవో కృతజ్ఞతలు తెలిపారు.