ప్రాజెక్టులున్నా.. సాగునీటి కరువే!

29-10-2026 | 01:33pm

కొల్లాపూర్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సీపీఐ (CPI) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీవో బాన్సులాల్‌కు వినతిపత్రం (Representation) అందజేశారు.

ఈ సందర్భంగా సీపీఐ కొల్లాపూర్ మండల కార్యదర్శి తుమ్మల శివుడు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌నినో (El Niño) ప్రభావం కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించిందన్నారు. కొల్లాపూర్ మండలంలో పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, పలు గ్రామాలకు సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మలచింతలపల్లి, ముక్కిడిగుండం, గేమ్‌నాయక్ తండా, ఎర్రగట్టు బొల్లారం, అమరగిరి, సోమశిల గ్రామాలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొందని తెలిపారు. కొన్ని గ్రామాలకు కాలువలు ఉన్నప్పటికీ, వాటి ద్వారా నేరుగా పంట పొలాలకు నీరు చేరడం లేదన్నారు. రైతులు విద్యుత్ మోటార్ల సాయంతో కాలువల్లోని నీటిని పంట పొలాలకు మళ్లించుకుంటున్నారని వివరించారు. అయితే, మోటార్ల నిర్వహణకు సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు నిలిచిపోతుందో తెలియని పరిస్థితి నెలకొందని విమర్శించారు.

ప్రభుత్వం స్పందించి కొల్లాపూర్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడంతో పాటు రైతులకు సాగునీరు, విద్యుత్ సమస్యల నుంచి ఉపశమనం కల్పించాలని సీపీఐ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు జంగం శివుడు, లక్ష్మయ్య, రాముడు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు