తరగతులకు తాళాలు.. చదువులు ఎలా సారూ?
బాన్సువాడ, అక్టోబర్ 29 (విజయక్రాంతి): తరగతి గదులకు తాళాలు పడ్డాయి.. మరి విద్యార్థుల చదువుల పరిస్థితి ఏమిటి? అనుమతులు లేని 8, 9వ తరగతి గదులను విద్యాశాఖ అధికారులు(Education Department Officials) సీజ్ చేయడంతో విద్యార్థుల భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల వ్యవహారం విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళనకు కారణమవుతోంది.
అనుమతుల విషయంలో విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టడం ఒకవైపు ఉంటే, మరోవైపు తమ పిల్లల చదువులు ఎలా కొనసాగుతాయనే ఆందోళన తల్లిదండ్రులను వెంటాడుతోంది. తరగతుల నిర్వహణకు అనుమతులు లేని కారణంగా గదులను సీజ్ చేసిన నేపథ్యంలో విద్యార్థులు ఇక ఎక్కడ చదువుకోవాలి? ఇతర పాఠశాలల్లో చేర్పించాలా? లేక అనుమతులు వచ్చే వరకు వేచి చూడాలా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అధికారుల చర్యలు సరే.. విద్యార్థుల చదువుల సంగతేంటి?
పాఠశాల అనుమతుల విషయంలో విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ, విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాల్సిన బాధ్యత కూడా సంబంధిత అధికారులపై ఉంది. ముఖ్యంగా విద్యా సంవత్సరం మధ్యలో చదువులకు అంతరాయం ఏర్పడితే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం విద్యార్థుల చదువుల కొనసాగింపుపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమిటి? అనుమతుల ప్రక్రియ ఎప్పటిలోగా పూర్తవుతుంది? అప్పటివరకు విద్యార్థుల విద్యాభ్యాసం ఎలా కొనసాగుతుంది? అనే అంశాలపై విద్యాశాఖ అధికారులు కూడా స్పష్టమైన ప్రకటన చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
తల్లిదండ్రులకు భరోసా కల్పించేదెవరు?
ఒకవైపు తరగతి గదులు సీజ్ కావడం, మరోవైపు తమ పిల్లల చదువులపై స్పష్టత లేకపోవడంతో తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. పాఠశాల యాజమాన్యం, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించి విద్యార్థుల చదువులకు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ విద్యా ఏర్పాట్లపై వెంటనే స్పష్టత ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.