ఎండు గంజాయి చాక్లెట్లు స్వాధీనం.. ఒకరి అరెస్టు
తూప్రాన్ టోల్‌ప్లాజా వద్ద ఎక్సైజ్ అధికారుల వాహన తనిఖీలు.. 218 గ్రాముల డ్రై గంజాయి స్వాధీనం
నర్సాపూర్, సెప్టెంబర్ 18: తూప్రాన్ టోల్‌ప్లాజా వద్ద ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 218 గ్రాముల ఎండు గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకుని, ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు నర్సాపూర్ ఎక్సైజ్ సీఐ గులాం ముస్తఫా(Narsapur Excise CI Ghulam Mustafa) తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు ఎక్సైజ్ సిబ్బందితో కలిసి టోల్‌ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ప్రాంతానికి చెందిన రాహుల్ వద్ద ఎండు గంజాయి చాక్లెట్లు గుర్తించినట్లు సీఐ తెలిపారు.
అక్రమంగా గంజాయిని కలిగి ఉండటంతో పాటు రవాణా చేసి విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు సీఐ గులాం ముస్తఫా వెల్లడించారు. జిల్లా ఎక్సైజ్ అధికారి ఎల్. నరసింహారెడ్డి ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో శిక్షణలో ఉన్న ఎక్సైజ్ అధికారి జ్ఞానేశ్వర్, నర్సాపూర్ ఎస్ఐ శరత్‌కుమార్, సిబ్బంది రవి, హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్, కానిస్టేబుల్ సందీప్, ఎక్సైజ్ కానిస్టేబుళ్లు ఫక్రుద్దీన్, మహేష్ పాల్గొన్నారు.