ఇహెచ్ఎస్ ను పక్కాగా అమలు చేయాలి...
చెన్నూర్, (విజయక్రాంతి): ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని (ఇహెచ్ ఎస్) (Employees' Health Scheme) పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (Telangana Region Teachers' Association) తపస్ రాష్ట్ర సేవా వింగ్ కో కన్వీనర్ యస్. శ్రీనివాసరావు (S. Srinivasa Rao) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండల సభ్యత్వంలో భాగంగా పలు పాఠశాలలను సందర్శించి, ఉపాధ్యాయులకు సభ్యత్వం ఇచ్చారు.
EHS పథకంపై ఇప్పటికి కూడా మార్గదర్శకాలు ఇవ్వకపోవడం, గత 4 నెలల ప్రీమియం నుండి కేవలం 2 నెలలే ట్రస్టుకు చెల్లించడం, ప్రభుత్వం తన వాటాను అసలే చెల్లించకపోవడం శోచనీయమని, పథకం ఆరంభంలోనే ఇలాంటి పరిస్థితి ఉండడం పట్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. ఉపాధ్యాయులు నేరుగా తమకు నచ్చిన హాస్పిటల్ లో చికిత్స చేయించుకునే వెసులుబాటు ఉండాలని అన్నారు. పిఆర్సిని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న 6డీఏ లను ప్రకటించాలని, పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ ను రద్దు చేసి, ఓ పి ఎస్ ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కొట్టె నాగరాజు, చెన్నూరు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండా శ్రీనివాసరెడ్డి, గజ్జల సురేశ్ లు పాల్గొన్నారు.