ఊటిపల్లి గ్రామ సెక్రటరీ మారినా.. బోర్డుపై పాత పేరే!
బోధన్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): బోధన్ మండలం(Bodhan Mandal)లోని ఊటిపల్లి గ్రామపంచాయతీలో సెక్రటరీ బదిలీ జరిగి దాదాపు ఐదు నెలలు గడిచినా గ్రామపంచాయతీ పాలకమండలి బోర్డుపై మాత్రం పాత సెక్రటరీ పేరు కొనసాగుతుండటంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రామ సెక్రటరీగా పనిచేసిన పోలా సుభాష్ బదిలీ అయినప్పటికీ, బోర్డుపై ఆయన పేరే ఉండటం గమనార్హం. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న సెక్రటరీ పేరును బోర్డుపై నమోదు చేయాల్సిన అవసరం లేదా అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
అదేవిధంగా గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులు సరిగా లేవని, పలు వార్డుల్లో సమస్యలు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో సుమారు రెండు వేల మందిని ఒకేసారి ఆహ్వానించినప్పటికీ, వారికి తాగునీరు తదితర కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం జరిగిందని వారు విమర్శిస్తున్నారు. గ్రామపంచాయతీ నిర్వహణ, పారిశుద్ధ్యం, ప్రజలకు అందాల్సిన కనీస సౌకర్యాల విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామపంచాయతీ బోర్డుపై సెక్రటరీ పేరును వెంటనే సవరించి, ప్రస్తుత సెక్రటరీ వివరాలను నమోదు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.