వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై జాగ్రత్తలు పాటించాలి
*జిల్లా వైద్యాధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్
పాపన్నపేట, సెప్టెంబర్ 18: వర్షాకాలం(Monsoon Season)లో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్(District Medical Officer Dr. Gnaneshwar) సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని పొడిచన్ పల్లి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో ముఖ్యంగా డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని, తాగునీటిని కాచి చల్లార్చుకుని వినియోగించాలని తెలిపారు. గర్భిణీలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు. పీహెచ్సీలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, సిబ్బంది హాజరు తదితర అంశాలను ఆయన పరిశీలించారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.