ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా..

18-09-2026 | 07:34pm

-కంకర రోడ్డుతో ప్రయాణికులకు నరకయాతన

-బేగంపేట–బెజ్జంకి రహదారి పనులు త్వరితగతిన పూర్తిచేయాలి

-ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చొరవ చూపాలి

-సోషల్ మీడియా ఇన్‌చార్జి శేఖర్‌బాబు డిమాండ్

బెజ్జంకి, సెప్టెంబర్ 18: సిద్ధిపేట జిల్లా(Siddipet District) బెజ్జంకి మండలంలోని బేగంపేట–బెజ్జంకి ప్రధాన రహదారి నిర్మాణ పనులను ఇకనైనా వేగవంతం చేసి పూర్తిచేయాలని సోషల్ మీడియా ఇన్‌చార్జి శేఖర్‌బాబు(Social Media In-charge Sekhar Babu) డిమాండ్ చేశారు. రహదారి పనులు అసంపూర్తిగా ఉండటంతో కంకర రాళ్లపై ప్రయాణించాల్సి వస్తుండగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

రహదారిపై పెద్దఎత్తున కంకర రాళ్లు తేలడంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కిందపడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగించే విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లే వారు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

శుక్రవారం విజయక్రాంతి మండల ప్రతినిధితో శేఖర్‌బాబు మాట్లాడుతూ.. బేగంపేట–బెజ్జంకి రహదారి పరిస్థితిపై స్థానిక ప్రజల ఆందోళనను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెంటనే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. రహదారి పనులకు అవసరమైన నిధులు సమకూర్చి, ఆలస్యం లేకుండా తారు రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఈ కీలక రహదారికి శాశ్వత పరిష్కారం చూపకపోవడం బాధాకరమన్నారు. కంకర రోడ్డుతో ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించి రహదారి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని శేఖర్‌బాబు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు