గుండాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి

18-09-2026 | 07:07pm
  1. సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు ఏజెన్సీకి అందించాలి
  2. అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్

గుండాల, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): ఎలినీనో ప్రభావంతో (El Niño effect) రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల (Central and state governments) విధానాల వలన కరువు తీవ్రత మరికొంత పెరిగిందని, జూన్ నుండి నేటి వరకు పడాల్సిన సాధారణ వర్షపాతం కంటే 22.5% తక్కువగా పడిందని, సాధారణ వర్షపాతం కంటే ఆగస్టు నెలలో 37% సెప్టెంబర్ నెలలో 77% తక్కువగా పడిందని, జూన్ నుండి నేటి వరకు రాష్ట్రంలో 626 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా 485 మిల్లీమీటర్లు మాత్రమే కురిసిందని అఖిల భారత రైతు కూలీ సంఘం మండల అధ్యక్షులు గడ్డం లాలయ్య, గుండాల సర్పంచ్ కోరం సీతారాములు అన్నారు.

ఆ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట పాయం ఎల్లన్న అధ్యక్షతన ధర్నాను నిర్వహించి, తహసీల్దార్ కార్యాలయం సిబ్బందికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం లాలయ్య, కోరం సీతారాములు మాట్లాడుతూ..జిల్లాలో 40 శాతం వరకు లోటు వర్షపాతం నమోదయిందని, రాష్ట్రంలో మొత్తం 621 మండలాల గాను 376 మండలాలు కరువు బారిన పడ్డాయని అన్నారు.

గత సంవత్సరం కంటే వరి సాగు 12 లక్షల ఎకరాలు తగ్గిందని, పత్తి, ఇతర మెట్ట పంటలు పూత దశకు వస్తున్న ఈ సెప్టెంబర్ నెలలో మరీ తక్కువ వర్షపాతం పడటం వలన భూమిలో తేమ తగ్గి పైర్ల ఎదుగుదల కూడా ఆగిపోతుందనీ, పరిస్థితి ఇలాగే కొనసాగితే వరితో సహా వేసిన పంటలన్నీ ఎండి పోతాయని అన్నారు. కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుండాల మండలాన్ని మరియు తెలంగాణ రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అరెo నరేష్, దుగ్గి శేఖర్, బానోతు లాలు, మోకాళ్ళ సూర్య నారాయణ, పెండకట్ల పెంటన్న, సీతారాములు, ఈసం కృష్ణన్న, పూనెం పొట్టెన్న, ధనసరి సమ్మన్న తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు