ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో బస్సు, నిచ్చెన గుర్తులను గెలిపించాలి
ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న
ఆసిఫాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): అక్టోబర్ 9న జరగనున్న ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో(In labor union elections) మూడో నిబంధనలో బస్సు గుర్తుకు, ఆరో నిబంధనలో నిచ్చెన గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న కార్మికులకు పిలుపునిచ్చారు. బుధవారం ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోలో ఐక్య కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. డ్రైవర్లు, కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పెండింగ్ బకాయిలను సాధిస్తామని అన్నారు. 2025 వేతన సవరణను మాస్టర్ పే స్కేల్‌గా మార్చడం, గ్యారేజీల హక్కులు సాధించడం, వర్క్‌షాప్ కార్మికులకు పని గంటల రేటు విడుదల చేయించడం, మహిళా కండక్టర్లకు పిల్లల సంరక్షణ సెలవులు సాధించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
కార్మికుల హక్కుల కోసం తమ సంఘం నిరంతరం పోరాటాలు చేస్తోందన్నారు. గతంలో చేపట్టిన మూడు రోజుల సమ్మె ద్వారా 32 సమస్యలకు పరిష్కార మార్గం చూపడంతో పాటు 2021 వేతన సవరణ సాధించామని తెలిపారు. కార్మికుల హక్కుల సాధన కోసం భవిష్యత్‌లోనూ పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి ఏఆర్ రెడ్డి మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు అవసరమన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సంజీవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్,డిపో గౌరవ అధ్యక్షుడు బోగే ఉపేందర్, అధ్యక్షుడు మల్లికార్జున్, ఉపాధ్యక్షురాలు మంజుల, కార్యదర్శి అశోక్, గ్యారేజీ కార్యదర్శి రవికుమార్, కోశాధికారి మోహన్‌బాబు, ఆర్పీ సింగ్, ప్రాంతీయ అధ్యక్షుడు శ్రీను, కార్యదర్శి పాషా, టీఎంయూ నాయకులు గంగాధర్, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ప్రవీణ్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు టి.దివాకర్, ఉప ప్రధాన కార్యదర్శి చిరంజీవి, ఉపాధ్యక్షుడు మహేష్, సీపీఐ నాయకులు బద్రి సతన్న, బోయిరె ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.