హిందీ భాషా మాధుర్యాన్ని అందరికీ పంచాలి
జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్
కామారెడ్డి, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): హిందీ భాష మాధుర్యాన్ని సమాజంలోని ప్రతి ఒక్కరికీ చేరవేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్ (Education Officer Mallikarjun) అన్నారు. హిందీ ఫోరం, కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి వరలక్ష్మి గార్డెన్స్ లో నిర్వహించిన హిందీ దివస్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
దేశంలో అత్యధికంగా మాట్లాడే భాష హిందీ అని, ఇది జనసంపర్క భాషగా విశేష ప్రాధాన్యం పొందిందన్నారు. సమున్నత సాహిత్య సంపదను కలిగిన ప్రాచీన భాషగా హిందీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు, ప్రస్తుతం అనేక దేశాల్లో హిందీ మాట్లాడే ప్రజల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని పేర్కొన్నారు. హిందీ భాషను ప్రతి ఒక్కరూ ఆదరించి, అభ్యసించాలని పిలుపునిచ్చారు.హిందీ సాహిత్య విలువలను ప్రొఫెసర్ వాసాల వరప్రసాద్ వివరించారు. విశిష్ట అతిథిగా శాతవాహన విశ్వవిద్యాలయం అధ్యాపకులు ప్రొఫెసర్ వాసాల వరప్రసాద్ హిందీ భాషా మాధుర్యాన్ని సమాజానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. హిందీ భాషాభివృద్ధికి భాషా పండితులు చేస్తున్న సేవలను కొనియాడారు, హిందీ సాహిత్యంలోని విలువలు, వైభవాన్ని వివరించారు.
హిందీ అభ్యాస దీపిక’ స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా బిబిపేట ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయులు నర్సింలు పదో తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన హిందీ అభ్యాస దీపిక’ స్టడీ మెటీరియల్ను జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం హిందీ పండితులకు సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాల తో అలరించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
హిందీ దివస్ వేడుకల్లో భాగంగా జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. హిందీ భాష ఔన్నత్యం, భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని ప్రతిబింబించే విధంగా విద్యార్థులు హిందీ పాటలు, నృత్య ప్రదర్శనలు, నాటికలు, దేశభక్తి గేయాలు ప్రదర్శించి సభికులను విశేషంగా అలరించారు. విద్యార్థుల ప్రతిభకు హాజరైన అతిథులు అభినందనలు తెలియజేస్తూ, హిందీ భాష పట్ల వారి ఆసక్తిని ప్రశంసించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు బలరాం, నీలం లింగం, వేణు శర్మ మాట్లాడుతూ, హిందీ ఫోరం ఆధ్వర్యంలో ఇంత ఘనంగా హిందీ దివస్ నిర్వహించడం జిల్లా హిందీ పండితుల సమిష్టి కృషికి నిదర్శనమని అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి సహేందర్ నాథ్, కోశాధికారి విక్రమ్ కుమార్, ముఖ్య సలహాదారులు నార్ల అరుణ్ కుమార్, చింతల లింగం, గఫూర్ శిక్షక్, బి.ఎన్. గిరి, గజెల్లి రమేష్, వంశీధర్, పంచశీల, నరసింహులు, లక్ష్మణ్, సుదర్శన్, శ్యాం కుమార్ తదితర హిందీ పండితులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.