పంచాయతీ పనులపై డీపీవో సమీక్ష
కుభీర్,(విజయక్రాంతి): గ్రామపంచాయతీల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంతో పాటు నాణ్యత ప్రమాణాలు పాటించాలని డీపీవో శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. శనివారం కుభీర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పనుల్లో జాప్యం లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ(Sanitation Management)పై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సేవలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా సమన్వయంతో పనిచేయాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడవద్దని డీపీవో స్పష్టం చేశారు. సమావేశంలో డీఎల్‌పీవో లక్ష్మణ్, ఎంపీడీవో భూమారావు, మండల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.