రుద్రూర్‌లో 2బీహెచ్‌కే ఇళ్ల పంపిణీలో అక్రమాలకు తావివ్వొద్దు

18-09-2026 | 09:28pm

బోధన్, సెప్టెంబర్ 18 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రుద్రూర్ గ్రామంలో పేదలు, మైనార్టీ కుటుంబాలకు 2బీహెచ్‌కే ఇళ్ల పంపిణీ విషయంలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరుతూ మైనార్టీ సంక్షేమ సంఘం(Minority Welfare Association )ప్రతినిధులు బోధన్ ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు.

రుద్రూర్ గ్రామంలో మైనార్టీ కుటుంబాలు 500కు పైగా ఉన్నాయని, పేద కుటుంబాలకు 2బీహెచ్‌కే ఇళ్ల కోసం అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని వారు కోరారు. ఇళ్ల పంపిణీలో ఎలాంటి రాజకీయ లేదా ఇతర జోక్యాలకు అవకాశం లేకుండా పారదర్శకంగా అర్హత కలిగిన వారినే ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇటీవల గ్రామంలో నూతనంగా నిర్మించిన 2బీహెచ్‌కే ఇళ్ల పంపిణీకి సంబంధించి ప్రాథమిక జాబితా తయారు చేస్తున్నారని, కొందరు అర్హత లేని వ్యక్తుల పేర్లు జాబితాలో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. గతంలో గ్రామంలో జరిగిన 2బీహెచ్‌కే ఇళ్ల కేటాయింపులో అనర్హులకు ఇళ్లు దక్కాయనే ఆరోపణలు కూడా ఉన్నాయని తెలిపారు.

అర్హులైన పేదలకు, మైనార్టీ కుటుంబాలకు న్యాయం జరిగేలా అధికారులు స్థానికంగా విచారణ నిర్వహించి తుది జాబితా రూపొందించాలని కోరారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా 2బీహెచ్‌కే ఇళ్లను కేటాయించాలని మైనార్టీ సంఘం ప్రతినిధులు ఆర్డీఓను కోరారు.

మరిన్ని వార్తలు