పుష్కర ఘాట్ పనులకు అందరూ సహకరించాలి

24-10-2026 | 09:48pm

భక్తులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం

రూ.70 కోట్లతో మంథని ప్రాంతంలో అభివృద్ధి పనులు

మంథని లో పనులను పరిశీలించిన ఎండోమెంట్ కమిషనర్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష 

మంథని, అక్టోబర్ 24(విజయక్రాంతి) : మంథని గోదావరి పుష్కర ఘాట్(Manthani Godavari Pushkar Ghat) అభివృద్ధి పనులకు ప్రజలందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(Collector Koya Sri Harsha) అధికారులు కోరారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

శనివారం మంథని గోదావరి తీరంలో కొనసాగుతున్న పుష్కర ఘాట్ అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. ఘాట్ నిర్మాణం, రహదారుల అభివృద్ధి, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. పుష్కరాల సమయంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

పవిత్ర గోదావరి తీరంలోని మంథని పుష్కర ఘాట్‌కు ఆధ్యాత్మికంగా విశిష్ట గుర్తింపు ఉందని, ఈ ప్రాంతాన్ని మరో ప్రయాగను తలపించేలా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అధికారులు తెలిపారు. పనుల్లో జాప్యం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని పేర్కొన్నారు.

నిబంధనల ప్రకారమే ఇసుక వినియోగం

పుష్కర ఘాట్ అభివృద్ధి పనులకు షరతులతో కూడిన అనుమతులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. గోదావరి తీరంలోని ఇసుకను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. అనుమతించిన ప్రాంతం నుంచి ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టెండరు నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీనరేజీ రుసుమును తప్పనిసరిగా చెల్లించాలని సూచించారు.

రూ.70 కోట్లతో అభివృద్ధి పనులు

మంథని ప్రాంతంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం ప్రభుత్వం మొత్తం రూ.70 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతోంది. ఇందులో మంథని బస్టాండ్‌ నుంచి గోదావరి తీరం వరకు రహదారి అభివృద్ధికి రూ.22 కోట్లు, పుష్కర ఘాట్ అభివృద్ధికి రూ.28 కోట్లు, దేవాదాయ శాఖ పరిధిలోని పనులకు రూ.10 కోట్లు, మున్సిపాలిటీ పరిధిలో రెండో స్థాయి అభివృద్ధి పనులకు రూ.10 కోట్లు కేటాయించారు.

ఈ పనులు పూర్తయితే పుష్కరాలకు వచ్చే భక్తులకు రవాణా, పుణ్యస్నానాలు, ఇతర అవసరాలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. మంథని ప్రాంత అభివృద్ధికి కూడా ఈ పనులు దోహదపడనున్నాయి.

నాణ్యతలో రాజీ వద్దు

పుష్కరాల అభివృద్ధి పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి నాణ్యతా లోపాలు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. మంత్రి ఆదేశాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పర్యవేక్షణలో సంబంధిత శాఖల అధికారులు పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో మంథని ఆర్డీవో సురేష్, తహసీల్దార్ ఆరిపోద్దీన్, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, మంథని సీఐ బుద్ధే స్వామి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు