భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత
కోహెడ గ్రామపంచాయతీ కార్యాలయంలో 'భారత రాజ్యాంగ పరిరక్షణ వేదిక' సమాయత్త సమావేశం
కోహెడ, అక్టోబర్ 24 (విజయక్రాంతి): హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ(Husnabad Constituency JAC) ఆధ్వర్యంలో 'భారత రాజ్యాంగ పరిరక్షణ వేదిక' ఏర్పాటు దిశగా ఒక కీలకమైన సమాయత్త సమావేశం కోహెడ గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్బంగా హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత తరుణంలో భారత రాజ్యాంగం ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లను సవివరంగా విశ్లేషించారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఎంతో దార్శనికతతో రచించిన పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని, అందులోని లౌకిక, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత దేశంలోని ప్రతి పౌరునిపై ఉందన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పునాదులపై నిర్మితమైన మన వ్యవస్థకు ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో సమానత్వాన్ని దెబ్బతీసి పాతకాలపు అసమానతలను పెంచి పోషించేందుకు జరుగుతున్న మనువాద కుట్రలను ప్రతి ఒక్కరూ తీవ్రంగా పరిగణించాలన్నారు. విచ్ఛిన్నకర కుట్రలను ప్రజలంతా ఏకమై, ఐకమత్యంతో ఎదుర్కోవాలని విజ్ఞప్తి చేశారు. బడుగు, బలహీన, అణగారిన వర్గాల హక్కులకు రాజ్యాంగం కల్పించిన రక్షణ కవచాన్ని నిర్వీర్యం చేసే ఏ శక్తినైనా సామాజిక చైతన్యంతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ నెల 28న భారత రాజ్యాంగ పరిరక్షణ వేదిక మండల కమిటీ ఎన్నుకోవడం జరగనుందన్నారు.
ఈ కార్యక్రమం లో హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ కోఆర్డినేటర్ డ్యాగల సారయ్య, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్, అక్కన్నపేట మండలం జేఏసీ ఇంచార్జి వేముల జగదీష్, బందేల బాలకిషన్, శెట్టి సుధాకర్, మంద మల్లేశం, గోగుల రామస్వామి,వేల్పుల శంకర్, దూలం శ్రీనివాస్, పొన్నం అంజయ్య, ఆవుల మహేందర్,అరే కిషోర్, మంద రవీందర్, తలారి నర్సయ్య, బందేల రాజమౌళి, వేల్పుల వెంకటస్వామి, గజ్జుల లింగారావు, వేల్పుల మహేష్, మంద వంశీ, గజ్జెల ప్రవీణ్, రవీందర్, శంకర్, కొడముంజ వెంకటయ్య, ఎల్లయ్య, కిరణ్ పాల్గొన్నారు.