తురక కాశల సంక్షేమానికి ఏటా నిధులు
తురక కాశల సంక్షేమానికి ఏటా రూ.100 కోట్ల నిధులు కేటాయించాలి
రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బడే సాహెబ్ డిమాండ్
కోనరావుపేట,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అత్యల్ప సంఖ్యలో ఉన్న తురక కాశలను ప్రభుత్వం గుర్తించి, వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని తురక కాశ సంఘం(Turaka Kasha community) రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బడే సాహెబ్ కోరారు. తురక కాశల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో ఏటా రూ.100 కోట్ల నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని తురక కాశ యువకులను ఏకం చేయడంతోపాటు వారిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌లోని చాంద్‌నగర్‌లో రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలను నిర్వహించారు.
వారం రోజుల పాటు కొనసాగిన ఈ పోటీల్లో తెలంగాణలోని 23 జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ బడే సాహెబ్(Sheikh Bade Saheb) మాట్లాడుతూ... తురక కాశ సామాజిక వర్గం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి తదితర రంగాల్లో ఆ వర్గానికి అండగా నిలవాలని కోరారు. యువతలో ఐక్యతను పెంపొందించేందుకు, క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
నల్గొండ జట్టుకు ప్రథమ బహుమతి
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో నల్గొండ జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతిగా రూ.50 వేలు గెలుచుకున్నారు. హనుమకొండ జిల్లా క్రీడాకారులు ద్వితీయ బహుమతిగా రూ.25 వేలు సాధించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ షరీఫ్, రాష్ట్ర లీగల్ సెల్ ఇన్చార్జి యామిన్ భాష, రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్ రహీం, షాదుల్లా, సహాయ కార్యదర్శి సయ్యద్ హలీం, ప్రచార కార్యదర్శి సయ్యద్ ముఖిమ్, జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, అడ్వకేట్ మహమ్మద్, వార్డు సభ్యుడు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.