ప్రజావాణికి ఒక్క అధికారే దిక్కు?

12-10-2026 | 02:51pm

తుంగతుర్తి, (విజయ క్రాంతి): ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటికి పరిష్కారం చూపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం తుంగతుర్తి మండలంలో ఆశించిన స్థాయిలో నిర్వహించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజావాణిని ఆశ్రయిస్తుండగా, అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాల్సిన కార్యక్రమంలో ఒక్క అధికారి మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

ప్రజావాణి కార్యక్రమం ద్వారా భూ సమస్యలు, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, విద్యుత్, వ్యవసాయం, గ్రామపంచాయతీ, రెవెన్యూ తదితర శాఖలకు సంబంధించిన సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇందుకోసం వివిధ గ్రామాల నుంచి ప్రజలు మండల కేంద్రానికి వచ్చి తమ సమస్యలపై అర్జీలు సమర్పిస్తుంటారు. అయితే ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు అందుబాటులో లేకపోతే, దరఖాస్తుదారుల సమస్యలను వెంటనే పరిశీలించడం, సంబంధిత శాఖలకు వివరించడం వంటి ప్రక్రియలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది.

ప్రభుత్వం ప్రజలకు పాలనను చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రజావాణికి ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, క్షేత్రస్థాయిలోనూ అదే స్థాయిలో నిర్వహణ ఉండాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని శాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి వేదికగా నిలవాల్సిన కార్యక్రమంలో సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

ప్రజావాణి కార్యక్రమం కేవలం దరఖాస్తుల స్వీకరణకే పరిమితం కాకుండా, వాటి పరిష్కారానికి కార్యాచరణ చేపట్టే విధంగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యేలా ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని, అందిన దరఖాస్తులపై నిర్ణీత సమయంలో చర్యలు తీసుకొని దరఖాస్తుదారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకే ఒక్క అధికారి మాత్రమే అందుబాటులో ఉండగా, మిగతా శాఖల అధికారులు లేకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు. జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు, ప్రజలు కోరుతున్నారు. తుంగతుర్తి మండలంలో ప్రజావాణి కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు