భవాని మాలపై వివాదం
భవాని మాల ధరిస్తే క్లాసులకు అనుమతి లేదా? చంపాపేట్ సైనిక్ స్కూల్‌పై తల్లిదండ్రుల ఆగ్రహం!
చంపాపేట్: హైదరాబాద్‌లోని చంపాపేట్ మారుతి నగర్‌లో ఉన్న సైనిక్ స్కూల్(Champapet Sainik School) యాజమాన్యం తీరుపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవాని మాల ధరించిన పదో తరగతి విద్యార్థులను Special Classesకు అనుమతించలేదని వారు ఆరోపిస్తున్నారు. మాల తొలగిస్తేనే తరగతి గదుల్లోకి అనుమతిస్తామని పాఠశాల యాజమాన్యం చెప్పినట్లు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. దీంతో విద్యార్థులు స్పెషల్ క్లాసులకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో ప్రత్యేక తరగతులు కీలకమని, ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను క్లాసులకు దూరం చేయడం వల్ల వారి చదువుపై ప్రభావం పడుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పాఠశాల ముందు నిరసనకు దిగారు. భవాని మాల ధరించిన విద్యార్థులకు తరగతుల్లో ప్రవేశం నిరాకరించారా? యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వెనుక కారణమేంటి? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఆరోపణలపై పాఠశాల యాజమాన్యం వివరణ అందుబాటులో లేదు.