హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి చెక్కును అందజేసిన ఎస్పీ
30-09-2026 | 04:29pm
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 30, (విజయక్రాంతి):జిల్లా స్పెషల్ బ్రాంచ్(District Special Branch) విభాగంలో విధులు నిర్వరస్తూ అనారోగ్యంతో ఇటీవల మరణించిన హెడ్ కానిస్టేబుల్ హరి గోపాల్ కుటుంబానికి బుధవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో చెక్కు రూపంలో 1,00,000/-(లక్ష రూపాయల) నగదును అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో నిరంతరం విధులు నిర్వర్తించే అధికారులు ,సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మరణించిన పోలీసుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. ప్రభుత్వం తరఫున మరణించిన పోలీసు అధికారుల కుటుంబాలకు అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను త్వరితగతిన అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులకు సూచించారు.