ఉమ్మడి జిల్లాలో కొనసాగిన ముందస్తు అరెస్ట్ లు

30-09-2026 | 05:15pm

బిఆర్ఎస్ నాయకులు సహా 22ఏ బాధితులు, మాలమహానాడు ప్రతినిధులు

కరీంనగర్ క్రైం, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి కరీంనగర్ జిల్లా పర్యటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అరెస్టులు కొనసాగాయి. సీఎం పర్యటన అడ్డుకుంటారని భావించి బిఆర్ఎస్ నాయకులను(BRS leaders) కార్యకర్తలను మంగళవారం రాత్రి నుంచి అదుపులోకి తీసుకున్నారు.మొదట కరీంనగర్ జిల్లా కేంద్రంలో 22ఏ బాధితుల సంఘం నాయకులు ముఖ్యమంత్రిని కలిసి తమ గోడు వెళ్లబోసుకుందామని భావించినప్పటికీ భద్రతా కారణాల దృశ్య బుధవారం ఉదయమే వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.

బిఅర్ఎస్ నాయకులు కార్పొరేటర్లు సుదగోని కృష్ణగౌడ్,రాజశేఖర్ లతో పాటు 22ఏ బాధితుల సంఘం నాయకుడు మోహనరెడ్డి మరో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు.మరో వైపు మాల మహానాడు నాయకులను కూడా కరీంనగర్ త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా అరెస్టుల పర్వం కొనసాగింది.జిల్లా కేంద్రంలో ముఖ్య నాయకులను మంగళవారం రాత్రి నుండి అదుపులోకి తీసుకొని నిర్బంధించారు.

ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట లో కూడా ముందస్తు అరెస్ట్ లు కొనసాగాయి. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అరెస్ట్ లు చేశామని పోలీస్ అధికారులు ప్రకటించారు.సిరిసిల్ల లో నిర్వహించే బహిరంగసభ కు కట్టుదిట్టమయిన భద్రత ఏర్పాట్లు చేసిన పోలీసులు అరెస్ట్ చేసిన వారిని స్వంత పూచీకత్తుపై వదిలేస్తామని ఎలాంటి కేసులు నమోదు చేయబోమని స్పష్టం చేశారు.

ఇదిలావుంటే సీఎం పర్యటన కోసం ముందస్తు అరెస్టులు చేయడంతో చాలాచోట్ల నిరసన వ్యక్తం చేశారు.ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించకుండా ఉండేందుకు అరెస్టులు చేశారని ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని బిఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు