అంబేద్కర్ సెంటర్‌లో రోడ్డు మరమ్మతులు

23-10-2026 | 03:21pm

ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్

పాల్వంచ, అక్టోబర్ 23, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో జరుగుతున్న రోడ్డు మరమ్మతుల పనుల(Road repair work) కారణంగా శుక్రవారం తీవ్ర ట్రాఫిక్ సమస్య తలెత్తింది. వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్ సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది.

అంబులెన్స్ సైరన్ నిరంతరం మోగిస్తున్నప్పటికీ, రహదారి ఇరుకుగా ఉండటం, వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో వెంటనే దారి ఇవ్వడం సాధ్యపడలేదు. దీంతో అంబులెన్స్ నెమ్మదిగా ముందుకు కదులుతూ తీవ్ర ఇబ్బందుల మధ్య ట్రాఫిక్‌ను దాటి వెళ్లాల్సి వచ్చింది.

ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న రోగులకు ప్రతి నిమిషం అత్యంత విలువైనదని, ఇటువంటి ఆలస్యం తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు మరమ్మతుల సమయంలో ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రించేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అంబులెన్స్ వంటి అత్యవసర వాహనాలకు నిరంతరం ప్రాధాన్యత కల్పించే విధంగా ట్రాఫిక్ నిర్వహణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు