ఒకే వేదికపై పోలీస్ బాసులు

23-10-2026 | 03:37pm

హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల పోలీస్ శాఖలు, కేంద్ర దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా హైదరాబాద్‌లో కీలక సమావేశం జరిగింది. బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)తో పాటు పలు రాష్ట్రాల డీజీపీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులతో పాటు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ఐబీ, సీబీఐ, ఎన్‌ఐఏ, డీఆర్‌ఐ, సీఐఎస్‌ఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ వంటి కేంద్ర సంస్థల అధికారులు కూడా హాజరయ్యారు.

డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు

ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్(DGP CV Anand) మాట్లాడుతూ.. రాష్ట్రంలో నేరాల నియంత్రణకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నక్సల్స్‌ను ఎదుర్కొనేందుకు 1980లో గ్రేహౌండ్స్ విభాగాన్ని ఏర్పాటు చేశామని, తీవ్రవాద కార్యకలాపాల నియంత్రణకు ఆక్టోపస్‌ పనిచేస్తోందని వివరించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈగల్ ఫోర్స్ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

సైబర్ నేరాలపై ప్రత్యేక నిఘా

సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(Cyber Security Bureau) చేపట్టిన కార్యక్రమాలకు కేంద్రం నుంచి గుర్తింపు లభించిందని డీజీపీ వెల్లడించారు. పోలీస్ సేవలను మరింత సమర్థంగా అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, టీస్పార్క్ పేరుతో పోలీస్ యాప్‌లను అప్‌డేట్ చేసినట్లు తెలిపారు. మహిళల భద్రత కోసం టీసేఫ్ యాప్‌ను రూపొందించినట్లు వివరించారు.

నక్సల్స్ నిర్మూలనపై డీజీపీ వ్యాఖ్యలు

తెలంగాణలో నక్సల్స్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్న డీజీపీ.. 824 మంది నక్సల్స్ లొంగిపోయారని, 302 ఆయుధాలను అప్పగించారని తెలిపారు. రాష్ట్రాన్ని నక్సల్స్ రహితంగా మార్చే దిశగా చేపట్టిన చర్యలను ప్రస్తావించారు.

విపత్తుల సమయంలో కమాండ్ సెంటర్ కీలకం

ప్రకృతి విపత్తుల సమయంలో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సమన్వయంతో సేవలు అందించగలిగామని డీజీపీ తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ భద్రత, మహిళల రక్షణ వంటి అంశాల్లో పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్లు వివరించారు. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర భద్రతా సంస్థల మధ్య సమాచార మార్పిడి, పరస్పర సహకారం పెంపొందించుకోవడానికి ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని వార్తలు