లాడ్జిలో మైనర్ బాలికలకు వేధింపులు
కరీంనగర్ క్రైం, నవంబర్ 29 (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని మంకమ్మతోటలో ఉన్న జీఎన్ఆర్ గ్రాండ్ లాడ్జిలో మైనర్ బాలికలపై వేధింపుల (Harassment) ఘటన కలకలం రేపింది. ఇద్దరు బాలికలను మాయమాటలతో లాడ్జికి తీసుకువచ్చి వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు (Police) అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన కరీంనగర్ టూ టౌన్ పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్ (Arrest) చేశారు.
నిందితులను జగిత్యాల జిల్లా అలీపూర్ గ్రామానికి చెందిన పాచుడుల రిషికుమార్ (19), ఎనుగుర్తి శివ సాయి వరప్రసాద్ (21)గా గుర్తించారు. పరిచయాన్ని ఆసరాగా చేసుకుని బాలికలను లాడ్జికి తీసుకువచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మైనర్లనే విషయం బయటపడకుండా ఉండేందుకు ఇతరుల ఆధార్ కార్డులు చూపించి రెండు వేర్వేరు గదులను బుక్ చేసుకున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. లాడ్జికి వచ్చిన వారి గుర్తింపు పత్రాలను సరిగా పరిశీలించకుండా, ఇతరుల ఆధార్ కార్డులతో గదులు కేటాయించినందుకు మేనేజర్ నల్లపాటి వీరాంజనేయులుపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు జిల్లాలోని అన్ని లాడ్జిల యాజమాన్యాలకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. లాడ్జికి వచ్చే ప్రతి ఒక్కరి గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా పరిశీలించి, పూర్తి వివరాలతో రిజిస్టర్లు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా మైనర్ల వయస్సు, గుర్తింపును నిర్ధారించకుండా గదులు కేటాయించరాదని స్పష్టం చేశారు. లాడ్జి ప్రవేశ ద్వారం, రిసెప్షన్, పార్కింగ్ ప్రాంతాల్లో సీసీటీవీ (CCTV) కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని, ఫుటేజీని చట్టప్రకారం భద్రపరచాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.