మొదలైన గొడవలు.. పంచాయితీ ఎన్నికల్లో హింస
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత గ్రామ పంచాయతీ(AP Panchayat Elections 2nd Phase) ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే పలు ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. అయితే ఎన్నికల సందడి మధ్య కొన్ని చోట్ల వివాదాలు, ఘర్షణలు, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా కడప జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఉద్రిక్తత చోటుచేసుకోగా.. కాకినాడ జిల్లాలో బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్ల విషయంలో అయోమయం నెలకొంది.
3,803 సర్పంచ్ స్థానాలకు పోలింగ్
రెండో విడతలో మొత్తం 3,803 సర్పంచ్ స్థానాలు, 29,603 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవుల కోసం 10,295 మంది, వార్డు మెంబర్ స్థానాల కోసం 63,395 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రంలోని 27 జిల్లాల పరిధిలో ఉన్న 52 డివిజన్లు, 246 మండలాల్లో ఈ Polling నిర్వహిస్తున్నారు. ఇందుకోసం అధికారులు 37,019 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ విడతలో ఇప్పటికే 1,170 సర్పంచ్ స్థానాలు, 19,655 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. గ్రామాల్లో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుండగా, పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
కడప జిల్లాలో ఘర్షణలు.. పోలింగ్‌కు ముందే ఉద్రిక్తత
కడప జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీరపనాయనపల్లె మండలం పాయసంపల్లిలో పోలింగ్ ప్రారంభానికి ముందే రెండు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. గ్రామంలోకి బయటి వ్యక్తులు రావడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం. దీంతో అక్కడ కొంతసేపు Tension వాతావరణం నెలకొంది. మరోవైపు వేంపల్లిలోని పోలింగ్ కేంద్రం వద్ద కూడా హైటెన్షన్ నెలకొంది. ఓటు వేసేందుకు తమను అనుమతించడం లేదంటూ మహిళలు ఆందోళనకు దిగారు. తమ ఓట్లను కూటమి నేతలే వేస్తున్నారంటూ ఆరోపించారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్ల నుంచి బ్యాలెట్ పేపర్లు లాక్కున్నారని కూడా కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కాకినాడలో బ్యాలెట్ పేపర్‌పై గందరగోళం!
కాకినాడ జిల్లా రాజుపాలెంలోని మూడో వార్డు పోలింగ్ కేంద్రం వద్ద మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈ వార్డులో ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉండగా.. బ్యాలెట్ పేపర్లో మాత్రం ఇద్దరి పేర్లే కనిపించడంతో ఓటర్లు అయోమయానికి గురయ్యారు. ఎవరికి ఓటు వేయాలనే విషయంలో గందరగోళం నెలకొంది. ఈ పరిణామంపై స్థానికంగా చర్చ మొదలైంది. మొత్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో పోలింగ్ ఉత్సాహంగా సాగుతుండగా, మరికొన్ని చోట్ల వివాదాలు, ఆరోపణలు ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించాయి. ఈ ఘటనలపై అధికారులు ఎలా స్పందిస్తారు? పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.