వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
- స్టీరింగ్ విరగడంతో అదుపుతప్పిన బస్సు
- త్రుటిలో తప్పిన ప్రమాదం
- 13 మందికి స్వల్పగాయాలు
- సిద్దిపేట జిల్లా సుందరగిరిలో ఘటన
చిగురుమామిడి, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు స్టీరింగ్ విరగడంతో అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. బస్సులో ప్రయాణిస్తున్న 13 మందికి స్వల్ప గాయాలయ్యాయి. హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హుస్నాబాద్ నుంచి కరీంనగర్‌కు 54 మంది ప్రయాణికులతో బయలుదేరింది. హుస్నాబాద్ నుంచి సుందరగిరి వరకు రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
బస్సు డ్రైవర్ హరీష్.. సుందరగిరి పరిధిలోని పెసరపల్లె దాటిన మూలమలుపు వద్ద బస్సును మలుపుతుండగా స్టీరింగ్ విరగడంతో బస్సు అదుపుతప్పి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. బస్సు ముందు టైర్లు బావి లోపలివైపు వెళ్లి ఆగిపోయింది. ప్రయాణికులు వెంటనే బస్సులో నుంచి కిందకు దిగారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 54 మంది ప్రయాణికులుండగా.. వీరిలో 13 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
చిగురుమామిడి మండలం నవాబుపేటకు చెందిన కె శిరీష, సిహెచ్ ఆర్యన్, హుస్నాబాద్ కు చెందిన ప్రమీల, రామచంద్రం, మురళీకృష్ణ, లాస్య, గాంధీ నగర్ కు చెందిన లచ్చవ్వ, దినేష్, మోత్కుపల్లికి చెందిన లలిత, భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ కు చెందిన కాంతమ్మ, రాముల పల్లెకు చెందిన కనకవ్వ, గౌరవెల్లి కి చెందిన కనకయ్య, నిమ్మలకు గాయాలు కావడంతో వారిని పోలీసులు హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఘటన స్థలాన్ని ఎస్సై జగదీశ్వర్, హుస్నాబాద్ డీఎం వెంకన్న, చిగురుమామిడి తహసీల్దార్ కోడం కనకయ్య పరిశీలించారు. బస్సును ప్రోక్లైన్ సహాయంతో బయటకు తీసి హుస్నాబాద్ కు తరలించారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై జగదీశ్వర్ తెలిపారు.






