ఆయుధాల చోరీ వెనుక అసలు ప్లాన్ ఇదే
ఆర్మీ ఆయుధాలతో భారీ దోపిడీకి స్కెచ్
ముగ్గురు సైనికులు సహా ఏడుగురు అరెస్ట్!
హైదరాబాద్: మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో(Madras Regiment Armoury Theft) సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బొల్లారం ఆర్మీ ఆయుధాగారం నుంచి తుపాకులు, మందుగుండు సామగ్రి మాయం చేసిన కేసులో మరో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు ప్రస్తుతం విధుల్లో ఉన్న ఆర్మీ సిబ్బంది ఉండటం కలకలం రేపుతోంది. బ్యాంకులు, నగల దుకాణాలు, సంపన్నులను లక్ష్యంగా చేసుకుని భారీ దోపిడీలకు ఈ ఆయుధాలను ఉపయోగించాలనుకున్నట్లు మల్కాజిగిరి పోలీసులు వెల్లడించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ హవిల్దార్ మల్లేష్‌ను(Mallesh) సెప్టెంబర్ 11న అరెస్ట్ చేయగా.. తాజాగా మరో ఏడుగురు పట్టుబడ్డారు. దీంతో మొత్తం నిందితుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఆయుధాగారంలోని భద్రతా వివరాలు తెలిసిన సైనికుల సహకారంతోనే చోరీ(Army Weapons Theft) జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగిలించిన ఆయుధాలను కొనుగోలు చేసేందుకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తులతోనూ సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
మరో కీలక విషయం ఏమిటంటే.. ఈ ఘటన వెనుక ఉగ్రవాద సంబంధాలు లేవని, ప్రధానంగా భారీ ఆర్థిక నేరాలకు పాల్పడాలనే ఉద్దేశమే ఉందని పోలీసులు స్పష్టం చేశారు. చోరీకి గురైన ఏకే-203, ఇన్సాస్ రైఫిళ్లు, పిస్టళ్లు, వేలాది బుల్లెట్లను( Army Weapons Robbery Plan) పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? ఆయుధాల చోరీ వెనుక పూర్తి నెట్వర్క్ ఏంటి? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.