గొంతు తడుపుకునేందుకు వెళ్లి.. అనంత లోకాలకు..

18-09-2026 | 07:15pm

ప్రమాదవశాత్తు బోరుపై పడి విద్యుత్‌ షాక్‌తో మహిళ మృతి

పాపన్నపేట: ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలో కష్టపడింది. ఎండను సైతం లెక్కచేయకుండా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైంది. రోజంతా శ్రమించిన శరీరానికి దాహం వేయడంతో గొంతు తడుపుకునేందుకు సమీపంలోని బోరుబావి వద్దకు వెళ్లింది. కానీ అదే ఆమెకు చివరి అడుగైంది. దాహం తీర్చుకునేందుకు వెళ్లిన ఓ మహిళ ప్రమాదవశాత్తు బోరుబావిపై పడి విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందిన విషాద ఘటన పాపన్నపేట మండలం చికోడ్‌లో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. చికోడ్‌కు చెందిన బద్దం శోభరాణి (51) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గురువారం వ్యవసాయ పనుల కోసం కుమారుడు సంపత్‌ ద్విచక్రవాహనంపై ఆమెను పొలానికి తీసుకెళ్లి దింపి వెళ్లాడు.

రోజంతా పొలంలో పనులు చేసిన శోభరాణి సాయంత్రం అలసటతో దాహం తీర్చుకునేందుకు సమీపంలోని మరో రైతు వ్యవసాయ క్షేత్రంలోని బోరుబావి వద్దకు వెళ్లారు. నీరు తాగేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు బోరుబావిపై పడటంతో విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో పాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్‌ గౌడ్‌ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు సంపత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు