పూజలో ఆడంబరం.. నిమజ్జనంలో నిర్లక్ష్యం.. ఇదేనా భక్తి..?
భక్తి కనిపించాలి.. హడావుడి కాదు
గౌరవం ఉండాలి.. ఆడంబరం కాదు
వినాయకుడిని పూజించినట్టే.. నిమజ్జనంలోనూ గౌరవంగా సాగనంపుదాం
హైదరాబాద్: వినాయక చవితి వచ్చిందంటే చాలు.. నగరాలు, పట్టణాలు, గ్రామాలు సందడిగా మారిపోతాయి. భారీ వినాయక విగ్రహాలు.. లక్షల రూపాయలతో కళ్లు చెదిరే సెట్టింగులు.. చెవులు చిల్లులు పడేలా డీజే శబ్దాలు.. లేజర్ లైట్ల హంగామా.. ఇలా పండుగ సందడి రోజురోజుకూ పెరుగుతోంది. కానీ ఈ హడావుడి మధ్య అసలు భక్తి ఎక్కడుంది అన్న ప్రశ్న ఇప్పుడు పలువురి నుంచి వినిపిస్తోంది.
వినాయకుడిని భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించి పూజించడం ఒక ఎత్తయితే.. అదే వినాయకుడిని నిమజ్జనం చేసే సమయంలో కనిపిస్తున్న దృశ్యాలు మరో ఎత్తు. పూజించిన దేవుడిని ఎంతో గౌరవంగా సాగనంపాల్సిన వేళ.. నిమజ్జనం పేరుతో విగ్రహాలను నిర్లక్ష్యంగా నీటిలోకి నెట్టడం, తొక్కడం వంటి దృశ్యాలు కనిపించడం ఆలోచింపజేస్తోంది.
పూజలో ఆడంబరం కాదు.. ఆత్మీయత ముఖ్యం
భక్తి అంటే భారీ విగ్రహాలు ఏర్పాటు చేయడమే కాదు.. ఖరీదైన అలంకరణలు చేయడమూ కాదు. చెవులు మోగిపోయేంత శబ్దం చేయడం, వేలాది వాట్ల లైట్లతో హడావుడి చేయడం కూడా భక్తికి కొలమానం కాదు. మనస్ఫూర్తిగా దేవుడిని కొలవడం.. పర్యావరణాన్ని కాపాడటం.. ఇతరులకు ఇబ్బంది కలగకుండా పండుగ జరుపుకోవడమే నిజమైన భక్తికి అర్థం.
వినాయకుడిని ప్రతిష్ఠించిన రోజు నుంచి నిమజ్జనం వరకు ప్రతి అడుగులోనూ భక్తి, బాధ్యత కనిపించాలి. దేవుడిని పూజించడం అంటే ఆయన ప్రతిరూపాన్ని కూడా గౌరవించడమే. నిమజ్జనం సమయంలోనూ అదే గౌరవం కొనసాగాలి.
మన పండుగ.. మన బాధ్యత
పండుగల అసలు ఉద్దేశం ఆధ్యాత్మికతతో పాటు సమాజంలో ఐక్యత, సంతోషాన్ని పెంచడం. కానీ పోటీ, ఆడంబరం, హడావుడి పెరిగిపోయి భక్తి వెనక్కి వెళ్లకూడదు.ముందుగా మన పండుగను మనమే గౌరవిద్దాం. మన దేవుడిని భక్తిశ్రద్ధలతో పూజిద్దాం. నిమజ్జనాన్ని కూడా అంతే గౌరవంగా నిర్వహిద్దాం. ఇతరులు మన విశ్వాసాలను గౌరవించాలని కోరుకునే ముందు.. మన విశ్వాసాలను మనమే ఎంత గౌరవిస్తున్నామో ఒక్కసారి ఆలోచిద్దాం.