సన్న బియ్యం వచ్చే.. దొడ్డు బియ్యం పాడయ్యే!
- పురుగుల పాలవుతున్న రూ.1.50లక్షల విలువైన నిల్వలు
- తేమ శాతం తగ్గి.. డీలర్లకు తలమడుగుతున్న ఆర్థిక నష్టం
- సిద్దిపేట జిల్లాలో వృథాగా ఉన్న 700 టన్నుల దొడ్డు బియ్యం
- ప్రభుత్వ ముందస్తు ప్రణాళిక లోపంపై విమర్శలు
నంగునూరు, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): పేదలకు సన్న బియ్యం అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించినా.. అదే సమయంలో రేషన్ దుకాణాల్లో(Ration shop) మిగిలిపోయిన దొడ్డు బియ్యం నిల్వలపై మాత్రం ముందస్తు చర్యలు చేపట్ట లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సన్న బియ్యం పంపిణీ ప్రారంభమైన తర్వాత రేషన్ షాపుల్లో సకాలంలో సర్దుబాటు కాక, పాత దొడ్డు బియ్యం నిల్వలు ఇప్పుడు పురుగులు పట్టి,బూజుతో సంచులు చినిగిపోయే దుస్థితికి చేరాయి. పాత నిల్వలను సకాలంలో తొలగించకపోతే ప్రజాధనం వృథా అయ్యే పరిస్థితి ఏర్పడిందని విమర్శలు వెలువడుతున్నాయి.ఇది అటు పేదల ఆరోగ్యానికే కాకుండా, ఇటు రేషన్ డీలర్ల(Ration dealers) ఉసురు తీసేలా ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సంచులు చినిగి.. బూజు పడుతున్న వైనం
2025 ఏప్రిల్ 1 నుంచి రేషన్ కార్డుదారులకు(Ration card holders) ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ ప్రారంభమైంది.కానీ, కొత్త సన్న బియ్యం రాకముందు మిగిలిపోయిన పాత దొడ్డు బియ్యాన్ని ఏం చేయాలనే దానిపై పౌరసరఫరాల శాఖ(Civil Supplies Department) ఎలాంటి స్పష్టమైన ముందస్తు చర్యలు తీసుకోలేదు. దీంతో సిద్దిపేట జిల్లా(Siddipet District) వ్యాప్తంగా 786 రేషన్ దుకాణాలు ఉన్నాయి.కొన్ని రేషన్ దుకాణాలమేర సుమారు 700 టన్నుల దొడ్డు రేషన్ బియ్యం నిల్వ ఉన్నట్లు అందిన సమాచారం.
ఈ నిల్వ విలువ సుమారు రూ.1.50 లక్షల వరకు ఉంటుంది. నెలల తరబడి షాపుల్లోనే మూలుగుతున్న ఈ బియ్యం గాలి ఆడక,తేమతో పురుగులు పట్టి, చివరికి సంచులు కూడా బూజు పట్టి చినిగిపోయే స్థితికి చేరాయి. పాత బియ్యం పక్కనే కొత్త సన్న బియ్యాన్ని నిల్వ చేయాల్సి రావడం వల్ల, ఆ పురుగులు కొత్త బియ్యానికీ పాకుతాయని.. ఈ కారణంగా రేషన్ కార్డుదారులు కూడా బియ్యం నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డీలర్లకు నష్టాల ముప్పు
ఈ దొడ్డు బియ్యం వ్యవహారంలో డీలర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలాకాలంగా నిల్వ ఉండటం వల్ల బియ్యంలోని తేమ శాతం పూర్తిగా తగ్గిపోయి, తూకంలో తేడాలు వచ్చే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ పాత స్టాక్ను వెనక్కి తీసుకోవాలని, లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.తూకం,తేమ శాతం తగ్గే కొనుగోలు లేదా సర్దుబాటు సమయంలో ఈ నష్టమంతా తమ నెత్తిన పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల ప్రకారం పాత దొడ్డు బియ్యం పురుగులు పట్టినట్లు ఇంకా గుర్తించలేదని చెబుతున్నప్పటికీ..మరోవైపు రేషన్ దుకాణాల్లో మాత్రం బియ్యం పురుగులు పడుతున్నాయి. ప్రభుత్వం కొనుగోలు చేసిన బియ్యం ప్రజల సొమ్ముతో ముడిపడి ఉంటుంది. కోట్ల రూపాయల విలువైన ఆహార ధాన్యం రేషన్ దుకాణాల్లోనే పాడయ్యే పరిస్థితి వస్తే దానికి బాధ్యత ఎవరిది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సన్న బియ్యం పంపిణీకి ముందే పాత దొడ్డు బియ్యం నిల్వలను తరలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉంటే ప్రస్తుత పరిస్థితి వచ్చేది కాదని విమర్శలు ఉన్నాయి.ఇప్పటికైనా రేషన్ షాపుల్లో కుళ్ళిపోతున్న దొడ్డు బియ్యాన్ని తక్షణమే తొలగించాలని, డీలర్లకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.