గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుపై బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 22 (విజయ క్రాంతి): ప్రతి గ్రాడ్యుయేట్ తమ ఓటును నమోదు చేసుకునేలా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో గండ్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, తమ పరిధిలోని ప్రతి గ్రాడ్యుయేట్‌ను వ్యక్తిగతంగా కలిసి ఓటరు నమోదు (Voter Registration)పై అవగాహన కల్పించాలని సూచించారు.
ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును (Voting Rights) వినియోగించుకునేలా చొరవ చూపాలని కోరారు. ఈ ప్రక్రియను బాధ్యతగా నిర్వహిస్తూ, ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, సీనియర్ నాయకులు సెగ్గం సిద్ధు, మందల రవీందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.