నిరంకుశ పాలనపై పోరాడిన ప్రజావీరుడు
మంచిర్యాల టౌన్ (విజయక్రాంతి): పెత్తందారులు, భూస్వాములు, జమీందారీ వ్యవస్థతో పాటు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తెలంగాణ ప్రజావీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ అని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య అన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన పండుగ సాయన్న జయంతి వేడుకలకు ఆయన హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల అణచివేతను ఎదిరించి పోరాడిన ప్రజావీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ అని తెలిపారు. తెలంగాణ ప్రజావీరుడిగా, తెలంగాణ రాబిన్‌హుడ్‌గా (Robin Hood) పేరుగాంచిన పండుగ సాయన్న జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
సమాజంలోని పేద ప్రజల కష్టాలను గుర్తించి, వారి సంక్షేమానికి సాయన్న కృషి చేశారని పేర్కొన్నారు. ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పేద ప్రజల సంక్షేమానికి తోడ్పడిన ఇలాంటి మహనీయులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. మహనీయులు చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో సమానత్వం, సేవాభావం, పేదల పట్ల మానవత్వాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీఆర్ఓ మోతిరాం, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నీరటి రాజేశ్వరి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా పరిషత్ సీఈఓ గణపతి, జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, ముదిరాజ్ సంఘం ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు