ఇచ్ఛంపల్లిలో జల విద్యుత్ కేంద్రం నిర్మించాలి..
కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ డిమాండ్..
పలిమెల అక్టోబర్ 2 (విజయక్రాంతి): ఇచ్చంపల్లిలో జలవిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కుల సంఘాల జేఏసీ చైర్మన్ పీక కిరణ్(Pika Kiran) డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గురువారం జరిగిన కేబినెట్ భేటీలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల ఈపీసీ ఒప్పందాలను రద్దు చేసి, కొత్త టెండర్ల ద్వారా పునఃప్రారంభించాలని తీసుకున్న నిర్ణయాన్ని పీక కిరణ్ స్వాగతించారు.
ఈ క్రమంలోనే దశాబ్దాలుగా నలిగిపోతున్న ఇచ్చంపల్లి ప్రాజెక్టును మళ్లీ ప్రారంభించి, అక్కడ భారీ జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని ఆయన అన్నారు. తాజాగా రాష్ట్ర మంత్రివర్గం భవిష్యత్ విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు 7,800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తులకు సంబంధించి టెండర్లు పిలవాలని, పాత సాగునీటి ప్రాజెక్టులకు కొత్త ఊపిరి పోయాలని నిర్ణయించిందని ఆయన గుర్తుచేశారు.
ఇదే సందర్భంలో మారుమూల అటవీ ప్రాంతమైన పలిమెల మండలంలో ఉన్న ఇచ్ఛంపల్లి వద్ద జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత రూపురేఖలే మారిపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇచ్ఛంపల్లిలో జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీనివల్ల యువత వేరే ప్రాంతాలకు పోయే వలసలు పూర్తిగా తగ్గుతాయని అన్నారు.
మంత్రి శ్రీధర్ బాబు చొరవ చూపాలి.
స్థానిక సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) ప్రత్యేక చొరవ తీసుకుని ఈ మారుమూల ప్రాంతానికి జల విద్యుత్ కేంద్రాన్ని మంజూరు చేయించాలని పీక కిరణ్ విజ్ఞప్తి చేశారు.