కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు

02-10-2026 | 10:09am
  1. రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం
  2. రైతులకు ఇవ్వకుండా..సింగరేణి విద్యుత్‌ను రాజస్థాన్‌కు అమ్ముకుంటారా?
  3. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు
  4. రెండు లక్షల పెండింగ్ కనెక్షన్లు -డీడీల పేరుతో దోపిడీ
  5. ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి ఎందుకు నోరు మెదపడం లేదు

నంగునూరు,(విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్( Power Crisis) రంగం పూర్తిగా అస్తవ్యస్తమైందని,నాణ్యమైన కరెంట్ అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్(Harish Rao) విమర్శించారు.సిద్దిపేట జిల్లా  నంగునూరు మండల పర్యటనలో బాగంగా  గురువారం నర్మేట విద్యుత్ సబ్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనికి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు.రాష్ట్రవ్యాప్తంగా రైతులు డీడీలు కట్టి సంవత్సరం దాటినా,సుమారు 2 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను ప్రభుత్వం విడుదల చేయడం లేదని హరీష్ రావు విమర్శించారు. కేసీఆర్(KCR) హయాంలో రూ. 4,500 ఉన్న డీడీ ధరను ప్రస్తుత ప్రభుత్వం రూ. 9,000కు పెంచినా నేటికీ కనెక్షన్లు ఇవ్వకుండా రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుతోందని మండిపడ్డారు.రాష్ట్రంలోనే రైతులకు కరెంట్ ఇవ్వడానికి సరిపోకపోతే,సింగరేణిలో ఉత్పత్తి అవుతున్న 800 మెగావాట్ల విద్యుత్‌ను రాజస్థాన్ ప్రభుత్వానికి అమ్ముకునేలా జాయింట్ వెంచర్ ఒప్పందాలు చేసుకోవడం సిగ్గుచేటని హరీష్ రావు విమర్శించారు.

గతంలో ప్రతి చిన్న విషయానికి లాగ్‌బుక్‌లతో తిరిగిన మంత్రులు ఇప్పుడు ఎందుకు నోరుమెదపడం లేదని ముఖ్యమంత్రి,విద్యుత్ శాఖ మంత్రి  స్పందించి ఎందుకు రివ్యూ చేయడం లేదని నిలదీశారు. నాణ్యమైన వోల్టేజ్ లేకపోవడం వల్ల మోటర్లు,ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని అన్నారు.ఒక్కో మోటరు కాలిపోతే వైండింగ్ చార్జీలు, కూలీల కింద సుమారు రూ.10,000 వరకు రైతుపై అదనపు భారం పడుతోందని, రెండు రోజుల పాటు పనులు నిలిచిపోయి పంటలు ఎండుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) ప్రభుత్వం 20 నుంచి 24 గంటల పాటు నిరంతరం నాణ్యమైన కరెంట్ ఇస్తే,నేడు కాంగ్రెస్ హయాంలో కనీసం 7 నుంచి 9 గంటల కరెంట్ కూడా సరిగ్గా రావడం లేదని, అది కూడా మధ్యమధ్యలో ట్రిప్ అవుతోందని రైతులు వాపోతున్నారని తెలిపారు.డీడీలు చెల్లించి ఎదురుచూస్తున్న రెండు లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణమే విడుదల చేయాలన్నారు.రైతాంగానికి రాత్రిపూట కూడా కలిపి కనీసం 20 గంటల పాటు నాణ్యమైన,లో-వోల్టేజ్ లేని విద్యుత్‌ను నిరంతరం సరఫరా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు..

నంగునూరు మండలం(Nangunur Mandal) అక్కెనపల్లి గ్రామంలో నిర్వహించిన ఈత వనాల పెంపకం కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలోనే సిద్దిపేట ప్రాంతానికి కాళేశ్వరం నీటిని తీసుకువచ్చే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు.గోదావరిలో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయకుండా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీటిని నిలిపివేస్తోందని మండిపడ్డారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని,కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని ధ్వజమెత్తారు.రంగనాయక సాగర్ ప్రాజెక్టును పూర్తిగా నింపితేనే యాసంగిలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.

గతంలో మిషన్ కాకతీయ(Mission Kakatiya), చెక్ డ్యామ్‌ల నిర్మాణం వల్ల భూగర్భ జలాలు పెరిగి నేడు తాటి, ఈత చెట్లకు కల్లు దిగుబడి వస్తోందని హరీశ్ రావు గుర్తుచేశారు. అనంతరం అక్కనేపల్లిలో ఆయిల్ పామ్ తోటను పరిశీలించి, సాగును మరింత విస్తరించాలని కోరారు. వ్యవసాయ, ఆయిల్ ఫెడ్ అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు సాగునీరు,యూరియా సకాలంలో అందేలా చూడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి,సర్పంచ్ పోతురాజు రేణుక రమేష్, పిఎసిఎస్ చైర్మన్ రమేష్ గౌడ్,మహిపాల్ రెడ్డి,నాయకులు ఎడ్ల సోమిరెడ్డి, కిష్టారెడ్డి, తిరుపతి, ఆయా గ్రామాల సర్పంచులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు