విద్యార్థులకు గుడ్‌న్యూస్

02-10-2026 | 03:53pm

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం(Breakfast) అందించే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు చర్యలు వేగవంతమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమక్షంలో హరే కృష్ణ ఫౌండేషన్‌(Hare Krishna Foundation)తో జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి.

నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల(Centralized community kitchens) ఏర్పాటుకు ఈ సంస్థలు ఆర్థిక సహకారం అందించనున్నాయి.  నాగర్‌కర్నూల్ కిచెన్ నిర్మాణానికి జున్నా సోలార్ సిస్టమ్స్ తరఫున రూ.5.17 కోట్ల చెక్కు, వికారాబాద్ కిచెన్ కోసం చైన్ ల్యాబ్స్ ఇండియా తరఫున రూ.4 కోట్ల చెక్కును హరే కృష్ణ ఫౌండేషన్‌కు అందించారు.

డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం

సెంట్రల్ కిచెన్ల నిర్మాణ పనులను నవంబర్ 30లోగా పూర్తి చేసి, డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. కిచెన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించి ఆహార నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. విద్యార్థుల శారీరక ఎదుగుదల, విద్యా పురోగతికి సంబంధించిన ట్రాక్ రికార్డును నిర్వహించాలని, ఆహారంలో అందించే పదార్థాల కేలరీలను లెక్కించేందుకు యాప్‌లను వినియోగించాలని రేవంత్ రెడ్డి సూచించారు.

ప్రాంతీయ ఆహారపు అలవాట్లకు అనుగుణంగా బ్రేక్‌ఫాస్ట్ మెనూ రూపొందించాలని చెప్పారు. విద్యార్థులు సమయానికి పాఠశాలకు చేరుకునేలా అల్పాహార పథకం ఉపయోగపడుతుందని పేర్కొన్న సీఎం.. ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు