ఎంపీ అవినాశ్ రెడ్డికి బిగ్‌షాక్
వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు!
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో(Viveka Murder Case) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 14న విచారణకు హాజరుకావాలని సమన్లు(Avinash Reddy ED Notice) పంపినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. వివేకా హత్యకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. వివేకా హత్యకు సంబంధించి సుమారు రూ.40 కోట్ల ఆర్థిక ఒప్పందం జరిగిందన్న ఆరోపణలపై ఈడీ దృష్టి సారించింది. ఈ కేసులో నిందితులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, నగదు బదిలీలు, ఇతర ఆర్థిక లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. 2019 నుంచి జరిగినట్లు అనుమానిస్తున్న ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేస్తూ మనీ ట్రైల్‌ను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
ఇప్పటికే పలువురిని విచారించిన ఈడీ
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, షేక్ దస్తగిరి తదితరులను ఈడీ విచారించింది. దస్తగిరి ఈ కేసులో అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. వారి వాంగ్మూలాలు, బ్యాంకు లావాదేవీలు, ఇతర ఆర్థిక వివరాలను దర్యాప్తులో భాగంగా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. వరుసగా కీలక వ్యక్తులను విచారించిన అనంతరం ఇప్పుడు అవినాష్ రెడ్డికి(YS Avinash Reddy) ఈడీ సమన్లు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అక్టోబర్ 14న విచారణకు హాజరైన సమయంలో ఈడీ ఏ అంశాలపై ప్రశ్నలు వేయనుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈడీ విచారణలో వెల్లడయ్యే అంశాలు, తదుపరి చర్యలపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. వివేకానందరెడ్డి 2019 మార్చి 15న హత్యకు గురయ్యారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తుతో పాటు, ఆర్థిక లావాదేవీల కోణంలో ఈడీ ప్రత్యేకంగా దర్యాప్తు కొనసాగిస్తోంది. అవినాష్ రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలను గతంలో ఖండించారు.