సూరారం సత్తా.. కోకోలో తెలంగాణకు రజతం!
మహాదేవపూర్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): హర్యానాలో నిర్వహించిన జాతీయస్థాయి కోకో పోటీల్లో (National Kho Kho Championships) తెలంగాణ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన ములకల సూర్యచరణ్, రిష్మిత్ తమ ప్రతిభను చాటి తెలంగాణ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
సూరారం గ్రామానికి చెందిన ఈ యువ క్రీడాకారులు మండల, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల హర్యానాలో జరిగిన పోటీల్లోనూ (National-Level Tournament) తమ ఆటతీరుతో ఆకట్టుకుని తెలంగాణ జట్టు రెండో స్థానంలో నిలిచేందుకు కృషి చేశారు.
జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ జట్టు రజత పతకం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. తమ కుమారులు ములకల సూర్యచరణ్, రిష్మిత్ జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచి పతకం సాధించడం మరింత ఆనందాన్ని కలిగించిందని హర్షం వ్యక్తం చేశారు.
సూరారం గ్రామానికి చెందిన యువకులు జాతీయస్థాయిలో ప్రతిభ చాటడంపై గ్రామస్థులు సైతం అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నతస్థాయి పోటీల్లో పాల్గొని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు