15 మంది ఒకే గర్జన.. అఖండ భారత్ మా లక్ష్యం
పాపన్నపేట, అక్టోబర్ 29: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 1న గుజరాత్(Gujarat)లోని ఏకతా నగర్లో నిర్వహించనున్న జాతీయ సమైక్యతా కార్యక్రమంలో మెదక్ జిల్లా నుంచి 15 మంది సభ్యులు పాల్గొననున్నారు. భారతీయ జనతా పార్టీ (BJP) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా సభ్యులు గురువారం ఉదయం సికింద్రాబాద్ నుంచి గుజరాత్‌కు బయలుదేరారు.
దేశ సమగ్రత, ఐక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel) చేసిన సేవలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే సభ్యులు పరేడ్‌లో పాల్గొని, భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ ప్రత్యేకత అనే సందేశాన్ని చాటిచెప్పనున్నారు.
ఈ పరేడ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననుండటంతో కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకోనుంది. యువతలో దేశభక్తి, జాతీయ సమైక్యత, సోదరభావాన్ని పెంపొందించడంతో పాటు సర్దార్ పటేల్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
మెదక్ జిల్లా నుంచి 15 మంది సభ్యులు ఈ జాతీయస్థాయి కార్యక్రమంలో పాల్గొనడం జిల్లాకు గర్వకారణంగా నిలవనుంది. దేశ ఐక్యత, సమగ్రతను ప్రతిబింబించే పరేడ్‌లో భాగస్వాములవుతూ సర్దార్ పటేల్ స్ఫూర్తిని చాటేందుకు సభ్యులు సిద్ధమయ్యారు.