ఎండుతున్న పంటలు....
- ఆందోళనలో రైతులు...
- ఎకరాకు రూ. 25 వేల పెట్టుబడి...
- పరిహారం అందించి ఆదుకోవాలి...
తాడ్వాయి, అక్టోబర్ 05 (విజయక్రాంతి): ఆరు గాలం కష్టపడి పంటలు వేసుకున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. దేవుడిపై భారముంచి పంటలు సాగు చేసుకున్న రైతన్నలకు ఇబ్బందులు తప్పడం లేదు. వానదేవుడు కరుణిస్తాడు ఎలాగైనా పంటలు పండుతాయనే నమ్మకంతో ప్రతీ సంవత్సరం రైతులు ఖరీఫ్ లో పంటలు సాగు చేసుకుంటారు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితి కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నోటికాడికి వచ్చిన పంట చేజారి పోతుంటే గుండెలవిసేలా విలపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడువాయి మండలంలో మొక్కజొన్న పంట సాగు చేసిన రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. ఈ ఖరీఫ్ సీజన్ లో 17 వేల ఎకరాలలో మొక్కజొన్న పంటను సాగు చేశారు.ప్రతి సంవత్సరం ఈ మండలంలో మొక్కజొన్న పంటను ప్రధాన పంటగా రైతులు సాగు చేస్తుంటారు.
మొక్కజొన్న పంటతోపాటు పత్తి ఫోయా, కంది, మినుము,పెసర,వరి తదితర పంటలు సైతం సాగు చేశారు. గత 25 రోజుల నుంచి వర్షాలు లేకపోవడంతో నోటి దాక వచ్చిన మొక్కజొన్న పంట చేజారిపోతుంది. మొక్కలు ఎండిపోయి కంకులు వాలిపోతున్నాయి. వర్షం లేకపోవడంతో మొక్కలకు సరిపోయేంత నీరు అందకపోవడంతో మొక్కజొన్న కంకులు గట్టిపడడం లేదు. కంకులు ఉన్నంత సైజులోనే ఎండిపోతున్నాయి.
ఇప్పటికే 6 వేల ఎకరాల్లో పంట నష్టం...
తాడువాయి మండలంలో ఇప్పటికే 6 వేల ఎకరాల్లోని మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. మిగతా 11 వేల ఎకరాలలో సైతం కొంత పూర్తిస్థాయిలో పంట రాగా మిగతా పంట సైతం నష్టపోయే పరిస్థితిలోనే ఉంది. వేల రూపాయల పెట్టుబడులు పెట్టి ఆకాశం వైపు రైతులు ఎదురుచూస్తున్నారు.
ఎకరాకు రూ. 25 వేల పెట్టుబడి..
రైతులు ఒక్కో ఎకరాకు రూ.25 వేల పెట్టుబడులు పెట్టారు. కనీసం పెట్టుబడి అయినా వచ్చే పరిస్థితి లేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పుట్టిన చోటల్లా అప్పులు చేసి పంట సాగు చేస్తే వరుణ దేవుడు కరుణించక పూర్తిగా నష్టపోతున్నామని రైతులు బోరుమంటున్నారు. మండలంలో వేసుకున్న పత్తి పంట సైతం పూర్తిస్థాయిలో దిగుబడి వచ్చే పరిస్థితులు లేవు ఒక్క తాడ్వాయి మండలంలోనే కాకుండా రాజంపేట, సదాశివనగర్, మాచారెడ్డి,లింగంపేట, మాచారెడ్డి, గాంధారి,రామారెడ్డి మండలాలలో వేసుకున్న మొక్కజొన్న పంట సైతం ఎండిపోతుంది.
పరిహారం అందించాలి..
ఎండిపోతున్న మొక్కజొన్న పంటలను గుర్తించి ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కనీసం పెట్టుబడులైన వచ్చే పరిస్థితి లేక తెల్లడిల్లిపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.