35 మందిని భయపెట్టిన టైర్ బ్లాస్ట్
- టైర్ పేలడంతో అదుపుతప్పిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
- డివైడర్‌పైకి దూసుకెళ్లిన వాహనం.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
- గద్వాల జిల్లా ఉండవల్లి వద్ద ఘటన.. 35 మంది ప్రయాణికులు సురక్షితం
అలంపూర్, అక్టోబర్ 5: ముందు టైర్ ఒక్కసారిగా పేలడంతో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Private travel bus) అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటన గద్వాల జిల్లా(Gadwal District) ఉండవల్లి మండలం జాతీయ రహదారిపై సోమవారం ఉదయం 11 గంటల సమయంలో చోటుచేసుకుంది.డ్రైవర్ లోకనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు నుంచి 35 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరిన స్వామి అయ్యప్ప ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఉండవల్లి స్టేజీ సమీపానికి చేరుకోగానే ముందు టైర్ అకస్మాత్తుగా పేలింది. దీంతో బస్సు అదుపుతప్పి డివైడర్‌పైకి ఎక్కి కొంతదూరం దూసుకెళ్లింది.
ఒక్కసారిగా జరిగిన ఘటనతో బస్సులోని 35 మంది ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.ప్రమాదంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.