యూరియా రవాణా భారం ప్రభుత్వమే భరించాలి
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(Primary Agricultural Cooperative Society) ఆధ్వర్యంలో సంఘ అధ్యక్షులు దుండిగల్ నర్సింలు అధ్యక్షతన మహాజన సభ బుధవారం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా 2026 ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు సంఘంలో జరిగిన జామ, ఖర్చుల వివరాలు సంఘ సెక్రటరీ సందీప్ కుమార్ సభలో చదివి సభ్యులకు వినిపించారు. అనంతరం సంఘ సభ్యులు, రైతుల అభ్యర్థులపై విస్తృతంగా చర్చించి పలు తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు.
యూరియా యాప్(Urea App) ద్వారా రైతులకు యూరియా అందడం లేదు.కనుక యాప్ను తొలగించాలని సంఘ సభ్యులు తీర్మానించి ఆమోదించారు. గతంలో కొనసాగిన విధంలోనే నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు. యూరియా రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరించాలని తీర్మానించారు. సొసైటీ పాలకవర్గాన్ని నామినేటెడ్ విధానంలో కాకుండా ఎన్నికల ద్వారా ఏర్పాటు చేయాలని తీర్మానించారు. మాల్తుమ్మెద సొసైటీ పరిధిలో క్రాప్లోను బాకీ ఉన్న రైతులకు ఫసల్ బీమా ప్రీమియం సొసైటీ(Crop Insurance Premium Society) నుండి చెల్లించాలి.
మాల్తుమ్మెద గ్రామంలో సొసైటీకి సొంత భవనం నిర్మించాలి. చీనురు వాడి గ్రామాల మధ్యలో 500 మెట్రిక్ టన్నుల గోదాం నిర్మించాలి. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు దుండిగల్ నర్సింలు మాట్లాడుతూ... సంఘ సభ్యుల,రైతుల సమస్యలను మహాజన సభ దృష్టికి తీసుకురావడం వాటిపై చర్చించి తీర్మానాలు చేయడం జరిగిందన్నారు. రైతు ప్రయోజనాలకు సంబంధించి అన్ని అంశాలను సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.