పీడీఎస్ బియ్యం పట్టివేత
జుక్కల్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని హై స్కూల్ వద్ద అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని(PDS Rice) ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు(Enforcement officials) పట్టుకున్నారు. 28వ తేదీ అర్ధరాత్రి సమయంలో వాహనంలో నింపుకుని అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్నట్లు గుర్తించిన స్థానికులు వాహనాన్ని అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన యువకులు ఈ విషయాన్ని పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. యువకులు వాహనాన్ని స్వచ్ఛందంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లగా, బియ్యాన్ని సంబంధిత అధికారులకు అప్పగించారు.
అధికారులు పంచనామా నిర్వహించి మొత్తం 15 క్వింటాళ్ల 90 కిలోల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. పట్టుకున్న పిడిఎఫ్ బియ్యాన్ని బిచ్కుంద ఎమ్మెల్యేస్ పాయింట్లు డంప్ చేశారని చెప్పారు. మండలంలోని చిన్న ఏడ్గి గ్రామానికి చెందిన యువకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ తరలింపుకు పాల్పడిన సంతోష్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మురళి తెలిపారు. అదేవిధంగా వాహనం సీజ్ చేశామని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని ఆయన హెచ్చరించారు.
ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ప్రజలు అవాక్కయ్యారు. ఇదేవిధంగా గత రెండు వారాల క్రితం చిన్న ఏడికి గ్రామం నుంచి 14 లారీల జొన్నల కొనుగోలు విషయంలో గోల్మాల్ జరిగిందని అందులో ప్రస్తుతం నిందితుడిగా ఉన్న సంతోష్ కీలకపాత్ర పోషించాడని వార్త వినిపిస్తోంది. ఇందులో ఇతనితో కలిసి మరో ఇద్దరు పెద్ద దళారులు ఉన్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అక్రమ రవాణా పట్ల అడ్డుకట్ట వేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. దీనికి సంబంధించి ఉన్నత స్థాయి అధికారులు విచారణ జరిపిస్తే ఇందులో ఎవరెవరు ఉన్నారని విషయాలు వెలుగులోకి వస్తాయని కూడా ప్రజలు చెబుతున్నారు.