విద్యుత్ కాంతుల్లో సద్దుల పండుగ వైభవం

19-10-2026 | 01:52pm

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని పెద్దవాగు(Peddavagu) వద్ద సద్దుల బతుకమ్మ నిమజ్జన వేడుకలను పురస్కరించుకుని మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ చైర్మన్ ఆకాష్, పాలకవర్గం ఆధ్వర్యంలో మహిళలు ఉత్సాహంగా నిమజ్జన వేడుకల్లో పాల్గొనేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. పెద్దవాగు పరిసరాలను విద్యుత్ దీపాలతో అలంకరించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

నిమజ్జన వేడుకలకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. విద్యుత్ కాంతుల నడుమ మహిళలు రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను తీసుకువచ్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలను ప్రోత్సహించేందుకు ప్రతి జట్టుకు మొదటి, రెండో బహుమతులు అందించేలా ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో బహుమతులు అందించడంపై మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. విద్యుత్ దీపాల అలంకరణతో పాటు బహుమతుల పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.

నిమజ్జన వేడుకలు సజావుగా జరిగేలా మున్సిపల్ కమిషనర్ అంజయ్య ఏర్పాట్లను పర్యవేక్షించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పెద్దవాగు పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తలు