ప్రజావాణికి ముగ్గురే అధికారులు.. ప్రజా సమస్యలు పట్టవా?

19-10-2026 | 02:57pm

అధికారుల గైర్హాజరుపై ప్రజల అసంతృప్తి

నాగల్‌గిద్ద,(విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అధికారుల హాజరు అంతంతమాత్రంగానే ఉండటంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నాగల్‌గిద్ద మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి(Prajavani program) ఎంపీడీవో మహేశ్వరరావు, ఏపీఎం నర్సింలు, జీపీవో మాత్రమే హాజరయ్యారు. మిగతా శాఖల అధికారులు గైర్హాజరు కావడంతో వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

ముఖ్యంగా రెవెన్యూ సంబంధిత సమస్యలను ఎవరికి విన్నవించుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులే ప్రజావాణికి హాజరుకాకపోతే ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రజల ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలని మండల ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు