ఓడిపోతే నిందలు.. గెలిస్తే సంబురాలా?

04-10-2026 | 05:20am
  1. మోదీని ఢీ కొట్టే దమ్ములేక శిఖండి రాజకీయాలు
  2. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య గౌడ్

హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంలు, ఎన్నికల సంఘంపై నిందలు వేస్తారని, గెలిస్తే నవరంధ్రాలు మూసుకొని సంబరాలు జరుపుకుంటారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఫైర్(BJP State Vice President Dr. Boora Narsaiah Goud) అయ్యారు. మోదీని ఢీకొట్టే దమ్ములేక రాజ్యాంగ వ్యవస్థల వెనుక దాక్కుని శిఖండి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ హయాంలో బీజేపీ 303 నుంచి 240 సీట్లకు తగ్గిందని గుర్తు చేశారు.

కాంగ్రెస్ సీట్లు 52 నుంచి 99కి పెరిగాయని తెలిపారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సర్ ప్రక్రియ వల్లే గెలిచామని కేరళంలో ఓ మంత్రి చెబితే.. కాంగ్రెస్ నాయకులు ధృతరాష్ట్రుడిలా చూడలేకపోతున్నారని విమర్శించారు. ఈవీఎంలు, ఎన్నికల సంఘంపై నమ్మకం లేకపోతే తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్యానికి ఎన్నికలు, ఎన్నికల నిర్వహణ ప్రాథమిక పునాదిరాయి లాంటివని, వరుస ఓటములతో ప్రజల ఆదరణ కోల్పోయిన కాంగ్రెస్, కొన్ని ప్రతిపక్షాలు వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించేలా కుట్ర చేస్తున్నాయన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అత్యధిక కాలం కాంగ్రెస్సే దేశాన్ని ఏలిందని, బీజేపీకి గతంలో కేవలం రెండు సీట్లు వచ్చినప్పుడు కూడా ఏనాడూ ఎన్నికల సంఘాన్ని, కోర్టులను తప్పుపట్టలేదని గుర్తుచేశారు.

దేశంలో అసలు ఈవీఎంలను ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ అని, ఇవి ఇంటర్‌నెట్‌తో సంబంధం లేని స్టాండ్ అలోన్ మిషన్లని, ఓటరు తాను ఎవరికి ఓటు వేశారో 7 సెకన్ల పాటు చూసుకునే వీవీప్యాట్ సదుపాయం కూడా అందుబాటులో ఉందని, ఈ మొత్తం ప్రక్రియను సుప్రీంకోర్టు స్వయంగా పరిశీలించి సమర్థించిందని గుర్తుచేశారు.


మరిన్ని వార్తలు