కో-పైలట్ గతం బయటపడింది
కో-పైలట్ గతం బయటపడింది.. ఒమన్‌లో ఫ్లయింగ్‌పై బ్యాన్!
దుబాయ్: ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న భయానక ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టెల్ అవీవ్‌కు వెళ్తున్న Flydubai FZ1073 విమానంలో కో-పైలట్ కెప్టెన్‌పై(Flydubai Co-Pilot) దాడి చేసి, విమానాన్ని తన నియంత్రణలోకి తీసుకునేందుకు ప్రయత్నించినట్లు UAE అధికారులు తెలిపారు. ఈ ఘటనలో విమానం ప్రమాదకరంగా కిందికి దూసుకెళ్లగా, ప్రయాణికులు, సిబ్బంది జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. తాజాగా ఈ ఘటనలో నిందితుడిగా గుర్తించిన హమామ్ అల్-హమ్మామీ(Hamam al-Hammami) గతానికి సంబంధించిన కీలక సమాచారం బయటకొచ్చింది. ఒమన్‌లో అతడి ప్రవర్తన, తీవ్రవాద భావజాలానికి సంబంధించిన ఆందోళనల కారణంగా విమానాలు నడపకుండా నిషేధించినట్లు దర్యాప్తుతో సంబంధం ఉన్న వ్యక్తి వెల్లడించారు. అనంతరం అతడు UAEకి చెందిన Flydubaiలో ఉద్యోగం పొందినట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
కాక్‌పిట్‌లో అసలేం జరిగింది?
సెప్టెంబర్ 30న Dubai-Tel Aviv Flightలో కెప్టెన్‌పై కో-పైలట్ దాడి చేసినట్లు UAE అధికారులు తెలిపారు. తాజాగా UAE ప్రాసిక్యూటర్ జనరల్ ప్రకారం, అతడు కాక్‌పిట్‌లో ఉన్న క్రాష్ యాక్స్‌తో కెప్టెన్‌పై(Captain Smit Machchhar) దాడి చేసి, విమానాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ కాక్‌పిట్ తలుపు తెరవగలిగాడు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో విమానంలో 182 మంది ఉన్నట్లు UAE అధికారులు తెలిపారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత విమానం సౌదీ అరేబియాలోని తబుక్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ఆఫ్-డ్యూటీ Flydubai పైలట్లు కూడా విమానాన్ని స్థిరీకరించడంలో కీలకంగా వ్యవహరించినట్లు రాయిటర్స్ తెలిపింది.
అసలు ముప్పు ఎక్కడ మొదలైంది?
ఇప్పుడు దర్యాప్తు సంస్థల ముందున్న ప్రధాన ప్రశ్న ఒమన్‌లో ఫ్లయింగ్‌కు అడ్డుకున్న వ్యక్తి Flydubaiలో కో-పైలట్‌గా ఎలా పనిచేశాడు? అన్నదే. అతడి నియామక సమయంలో ఎలాంటి వెట్టింగ్ జరిగింది, గతంలో ఉన్న భద్రతా ఆందోళనలు UAEలోని సంబంధిత సంస్థలకు తెలిసాయా అనే అంశాలపై దర్యాప్తు సాగుతోంది. అతడికి తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా లేదా ఒంటరిగా వ్యవహరించాడా అన్నది కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. అతడి ఉద్దేశం, సాధ్యమైన సంబంధాలపై తుది నిర్ధారణ ఇంకా రాలేదు.