హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం
హైదరాబాద్: నగరంలోని ఫతేనగర్ పరిధి ఎల్‌బీఎస్ నగర్‌లో గంజాయి విక్రయాలపై ఈగల్ ఫోర్స్ (EAGLE Force) అధికారులు దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించి, జతేన్ బీ (75) అనే మహిళను అరెస్ట్ చేశారు. ఆమె ఇంట్లో 179.1 గ్రాముల గంజాయితో పాటు రూ.43,340 నగదు, ఒక మొబైల్ ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి కొనుగోలు చేసేందుకు సుమారు 70 మంది అక్కడికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో 66 మందికి నిర్వహించిన పరీక్షల్లో డ్రగ్స్ పాజిటివ్ (Drug Test Positive) వచ్చినట్లు వెల్లడించారు. వారిలో 65 మందిని డీ-అడిక్షన్ కేంద్రానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు గుర్తించారు.
అరెస్టయిన జతేన్ బీపై గతంలోనూ గంజాయికి సంబంధించిన ఏడు కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో మరో ఐదుగురు అనుమానితుల కోసం ఈగల్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. మున్నీ బేగం, ఇమ్రాన్, హనీఫా బీ, ఖాజా బీ, ఖాజా పాషాల ఆచూకీ కోసం చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.