సీఎన్‌జీ వాహనాలతో అప్రమత్తం!

12-10-2026 | 05:25am
  1. చిన్న నిర్లక్ష్యం.. పెను ప్రమాదం
  2. గ్యాస్ సిలిండర్ భద్రతపై అవగాహన తప్పనిసరి
  3. నాణ్యమైన కిట్.. క్రమం తప్పని తనిఖీలే రక్షణ కవచం

మహబూబాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో పొదుపు కోసం పలువురు వాహనదారులు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. పెట్రోల్, డీజిల్తో పోలిస్తే నిర్వహణ వ్యయం తగ్గే అవకాశం ఉండటంతో సీఎన్జీ వినియోగం ప్రాధాన్యం సంతరించుకుంటోంది.

అయితే ఇంధన ఖర్చు తగ్గించుకోవాలనే ఆలోచనతో భద్రతా ప్రమాణాలను విస్మరిస్తే ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. ఇటీవల పలుచోట్ల వాహనాల్లో సి ఎన్ జీ నింపుతుండగా ప్రమాద ఘటనలు చోటుచేసు కుంటున్న నేపథ్యంలో వాహనదారులు ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరైన నిర్వహణ, నాణ్యమైన పరికరాలు, డ్రైవర్ అప్రమత్తతతోనే సీఎన్జీ ప్రయాణం సురక్షితంగా సాగుతుంది.

సిలిండర్ తనిఖీ.. అత్యంత కీలకం

సీఎన్జీ వాహనాల్లో అధిక పీడనంతో గ్యాస్ నిల్వ చేసే సిలిండర్ అత్యంత కీలకమైన భాగం. సిలిండర్ గడువు, పరీక్షల వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. అధీకృత కేంద్రాల్లో నిర్దేశిత వ్యవధిలో పరీక్షలు చేయించాలి. సిలిండ్ప తుప్పు, పగుళ్లు, బలమైన దెబ్బల గుర్తులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా నిపుణులతో తనిఖీ చేయించాలి. అనుమతి లేని వ్యక్తులతో సిలిండర్ మరమ్మతులు చేయించడం, వెల్డింగ్ చేయించడం లేదా దాని నిర్మాణంలో మార్పులు చేయించడం ప్రమాదకరం.

నాణ్యత లేని కిట్లతో పెను ముప్పు

పెట్రోల్ వాహనాలను సీఎన్జీకి మార్చుకునే సమయంలో గుర్తింపు పొందిన సంస్థల కిట్లనే వినియోగించాలి. అధీకృత కేంద్రాల్లోనే మార్పిడి చేయించడంతోపాటు వాహనానికి సంబంధించిన అనుమతులు, రిజిస్ట్రేషన్ వివరాలను నిబంధనల ప్రకారం నవీకరించాలి. తక్కువ ధరకు వస్తున్నాయని నాణ్యత లేని కిట్లు అమర్చించుకోవడం, అనధికారికంగా పైపులు లేదా వాల్వ్లను మార్చడం ప్రమాదాలకు దారితీయవచ్చు.

గ్యాస్ వాసన వస్తే అప్రమత్తం

వాహనంలో గ్యాస్ వాసన వచ్చినా, గ్యాస్ లీకేజీ అనుమానం కలిగినా వెంటనే సురక్షితమైన బహిరంగ ప్రదేశంలో ఆపాలి. ఇంజిన్ను ఆపి, ప్రయాణికులను దూరంగా తరలించాలి. పొగతాగడం, అగ్గిపుల్ల వెలిగించడం, మంటను ఉపయోగించడం పూర్తిగా నిషేధం. విద్యుత్ స్విచ్లు లేదా ఇతర పరికరాలను ఆన్, ఆఫ్ చేయకుండా ఉండాలి.

లీకేజీని స్వయంగా సరిచేయడానికి ప్రయత్నించకుండా అధీకృత సాంకేతిక నిపుణుల సహాయం తీసుకోవాలి. మంటలు లేదా తీవ్రమైన లీకేజీ ఉంటే ఆ ప్రాంతానికి దూరంగా వెళ్లి అత్యవసర సేవలకు సమాచారం ఇవ్వాలి.

పార్కింగ్లోనూ జాగ్రత్తలు

సీఎన్జీ వాహనాలను వీలైనంత వరకు గాలి ప్రసరణ బాగా ఉండే ప్రదేశాల్లో పార్కింగ్ చేయాలి. భూగర్భ పార్కింగ్ లేదా మూసివేసిన ప్రదేశాల్లో సీఎన్జీ వాహనాల ప్రవేశంపై అక్కడి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. గ్యాస్ నింపే సమయంలో ఇంజిన్ ఆఫ్లో ఉంచాలి. ఇంధనం నింపే సిబ్బంది సూచనలను పాటిస్తూ, వాహనంలో ప్రయాణికులు లేకుండా చర్యలు చేపట్టాలి. నిర్దేశిత భద్రతా విధానాలకు విరుద్ధంగా వ్యవహరించకూడదు.

క్రమం తప్పని సర్వీసింగ్ అవసరం

సీఎన్జీ వ్యవస్థలోని పైపులు, కనెక్షన్లు, వాల్వ్లు, రెగ్యులేటర్, లీకేజీ నిరోధక పరికరాలను వాహన తయారీ సంస్థ సూచించిన షెడ్యూల్ ప్రకారం తనిఖీ చేయించాలి. ప్రమాదం జరిగినా, వాహనానికి బలమైన దెబ్బ తగిలినా సిలిండర్తో పాటు మొత్తం గ్యాస్ వ్యవస్థను నిపుణులతో పరిశీలింపజేయాలి. అనుమతి లేని మార్పులు చేయకుండా, వాహనంలో అగ్నిమాపక పరికరం ఉంటే దానిని సక్రమ స్థితిలో ఉంచాలి.

భద్రతే ప్రథమ ప్రాధాన్యం

సీఎన్జీ వినియోగం వల్ల ఇంధన వ్యయం తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, భద్రత విషయంలో రాజీ పడకూడదు. సిలిండర్ పరీక్షలు, అధీకృత కిట్లు, నిపుణుల పర్యవేక్షణ, లీకేజీపై తక్షణ స్పందన వంటి జాగ్రత్తలు ప్రతి వాహనదారుడి బాధ్యత. అవగాహనతో కూడిన ప్రయాణమే ప్రమాదాల నివారణకు మార్గం. ఇంధన పొదుపు ఎంత ముఖ్యమో.. ప్రాణాల రక్షణ అంతకంటే ముఖ్యంగా వాహన యజమానులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

మరిన్ని వార్తలు