ఇక జైత్రయాత్రే
- కేంద్రంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం
- 2027లో గోవాలోనూ ప్రభుత్వం ఖాయం
- బీజేపీ పాలనలో డ్రగ్స్, భూదందాలు
- గోవా బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ అక్టోబర్ 11 (విజయక్రాంతి): దేశంలో కాంగ్రెస్ జైత్రయాత్ర మొదలైందని, గోవా విజయం మీదుగా నేరుగా ఢిల్లీ ఎర్రకోటపై కాంగ్రెస్ మువ్వన్నెల జెండా ఎగరడం ఖాయమని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(Telangana CM Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు. దేశంలోకి రుతుపవనాలు కేరళ నుంచి గోవాకు విస్తరించినట్టే,.. కాంగ్రెస్ అధికార సునామీ కూడా కేరళ నుంచి గోవాకు, అక్కడి నుంచి ఢిల్లీకి చేరబోతోందని స్పష్టం చేశారు.
గోవా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీజేపీకి వ్యతిరేకంగా చేపట్టిన యాత్రంలో భాగంగా ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఢిల్లీలో నిరసన కార్యక్రమాల వల్ల రాహుల్‌గాంధీ రాలేకపోవడంతో, ఆయన ప్రతినిధిగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జ్జున ఖర్గే తనను ఇక్కడి పంపించారని రేవంత్ తెలిపారు.
గోవా ప్రజలు బీజేపీతో విసిగిపోయారని, మూడోసారి అధికారంలోకి వస్తే ఇక్కడి ప్రజలు పరాయివారిగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇక్కడి భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, గోవా సీఎం ‘ప్రమోద్ సావంత్ కాదు.. ప్రాపర్టీ సావంత్’ అని ప్రజలే చెబుతున్నారని విమర్శించారు.
గోవా సీఎం అభివృద్ధిపై దృష్టి సారించకుండా, ఇక్కడి ఆస్తులను ఇతరులకు కట్టబెట్టే పనిలో ఉన్నారని మండిపడ్డారు. ఇక్కడి యువత డ్రగ్స్‌కు బానిసగా మారిందని, బీజేపీ పాలనలో రాష్ట్రం గోవా డ్రగ్స్ సోర్స్‌గా మారిందని రేవంత్ ఆరోపించారు. నషా ముక్త్ భారత్ అని మాట్లాడుతున్న ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక్కడ ఎందుకు అమలు చేయడం లేదు?
అని ప్రశ్నించారు. గోవాలో జరుగుతున్న పోరాటం రావణ్, రాముడికి మధ్య పోరాటమని అభివర్ణించారు. రావణ్ అంటే బీజేపీ, రాముడు అంటే కాంగ్రెస్ పార్టీ అని, రావణ్‌ను ఓడించాలంటే ప్రజలంతా రాముడికి మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు.
రెండుసార్లు గోవా ప్రజలు మోసపోయారు, మూడోసారి కూడా బీజేపీని నమ్మి మోసపోవద్దని, కాంగ్రెస్ పార్టీకి కాకుండా ఏ పార్టీకి ఓటు వేసినా అది బీజేపీకే చేరుతుందని రేవంత్ పేర్కొన్నారు. ‘దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన గోవాలో డ్రగ్స్, ల్యాండ్ మాఫియా రాజ్యమేలా? మీరే ఆలోచన చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ కోసం కాదని, గోవా ప్రజల కోసమేనని స్పష్టం చేశారు.
రాహుల్ ఏకం చేస్తుంటే.. మోదీ విభజిస్తున్నారు
రాహుల్‌గాంధీ దేశ ప్రజలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తుంటే, మోదీ విభజించడానికి ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి విమ్శించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నోస్, ఐస్ బీజేపీ ఫ్రంట్ ఆర్గనైజేషన్‌గా పని చేస్తాయి, ఇప్పుడు వాటితో కూడా బీజేపీకి ప్రయోజనం లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. అందుకే ఈసీ జ్ఞానేష్‌కుమార్‌ను అడ్డంపెట్టుకొని ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.
కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండే పేదలు, దళితులు, మైనారిటీలు, ఆదివాసీల ఓట్లను బీజేపీ టార్గెట్ చేసిందని ఆరోపించారు. బీజేపీ కుట్రలకు దేశ ప్రజలు త్వరలోనే చరమగీతం పాడబోతున్నారని పేర్కొన్నారు.
2026 మాన్‌సూన్‌లో కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, 2027 మాన్‌సూన్‌లో గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎర్ర కోటపై మూడు రంగుల జెండా ఎగరడం ఖాయం అన్నారు.