అద్భుత శిల్ప సౌందర్యం రామప్ప

04-10-2026 | 05:30am

కొనియాడిన విదేశీ ప్రతినిధి బృందం 

ములుగు, అక్టోబర్ 3 (విజయక్రాంతి): ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ శిల్ప వైభవంపై(The Sculptural Splendor of the Ramappa Temple) విదేశీ ప్రతినిధులు ప్రశంసల జల్లు కురిపించారు. కాకతీయుల నిర్మాణ పరిజ్ఞానం, శిల్పుల కళానైపుణ్యం అద్భుతమని కొనియాడారు. అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమంలో భాగంగా 18 దేశాలకు చెందిన 28 మంది విదేశీ అధికారులు, పాత్రికేయులతో కూడిన బృందం శనివారం ములుగు జిల్లాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శించింది.

కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత సాంకేతిక, ఆర్థిక సహకార కార్యక్రమం కింద హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ రెండు వారాల సామర్థ్య వికాస శిక్షణను నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 10 వరకు జరుగుతున్న .

ఈ ప్రత్యేక శిక్షణలో భాగంగా ప్రతినిధుల బృందం అధ్యయన పర్యటన చేపట్టింది. అల్జీరియా, భూటాన్, కాంబోడియా, ఈక్వడార్, ఫిజీ, ఘనా, లైబీరియా, మాల్దీవులు, మారిషస్, మొజాంబిక్, సీషెల్స్, సియెర్రా లియోన్, శ్రీలంక, టోగో, ఉజ్బెకిస్తాన్, వియత్నాం, జాంబియా, జింబాబ్వే దేశాలకు చెందిన అధికారులు, పాత్రికేయులు ఈ బృందంలో ఉన్నారు.రామప్ప దేవాలయ సందర్శన సందర్భంగా ఆలయ విశిష్టత, ప్రపంచ వారసత్వ గుర్తింపు ప్రాధాన్యం, శిల్పుల నైపుణ్యం,

నిర్మాణ పద్ధతులను ఆలయ గైడ్ విదేశీ ప్రతినిధులకు వివరించారు. భూకంపాలను తట్టుకునేలా ఇసుక పునాది సాంకేతికతను వినియోగించడం, ఆలయ గోపుర నిర్మాణంలో బరువును తగ్గించేందుకు నీటిపై తేలే తేలికపాటి ఇటుకలను ఉపయోగించడం వంటి కాకతీయుల నిర్మాణ పరిజ్ఞానం బృంద సభ్యులను ఆశ్చర్యానికి గురిచేసింది.నల్లరాతిపై సున్నితమైన నగిషీలతో చెక్కిన నిలువెత్తు శిల్పాలను, నాట్య భంగిమలతో కూడిన శిల్పాలను ఆసక్తిగా తిలకించారు.

సూది బెజ్జం దూరేంత సన్నని రంధ్రాలు కలిగిన శిల్పకళను ఆసక్తిగా తిలకించారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వెలుగు మారినా గర్భగుడిలోని శివలింగంపై ఒకే విధంగా వెలుగు పడేలా చేసిన కాకతీయుల ఖగోళ, వాస్తు నైపుణ్యాన్ని కొనియాడారు.ప్రతి శిల్పం ఆనాటి శిల్పుల ప్రతిభను, భారతీయ సంస్కృతి వైభవాన్ని భావితరాలకు చాటిచెప్పేలా ఉందని ప్రశంసించారు.

కాకతీయుల సాంకేతిక పరిజ్ఞానం, నిర్మాణ శైలి, కళానైపుణ్యం అద్భుతమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పర్యటన సమన్వయ అధికారి, జిల్లా పౌర సంబంధాల అధికారి రఫిక్, పర్యాటక సమన్వయ అధికారి ధర్మా నాయక్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు