విద్యార్థినిపై దాడిని ఖండిస్తూ పాఠశాల ముందు ధర్నా

18-09-2026 | 12:06am

మునుగోడు, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): మునుగోడు మండల(Munugode Mandal) కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల(Mahatma Jyotirao Phule Girls Gurukul School)లో విద్యార్థినిపై ఉపాధ్యాయురాలు దాడి చేసిన ఘటనను ఖండిస్తూ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో గురువారం పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి గోపగోని ఉదయ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో చాలామంది వ్యవసాయ కూలీలు, ఇతర కూలీ పనులు చేసుకునే వారేనని, ప్రభుత్వంపై నమ్మకంతో తమ పిల్లలను గురుకులాలకు పంపిస్తున్నారని తెలిపారు. అలాంటి విద్యార్థులకు రక్షణగా నిలవాల్సిన ఉపాధ్యాయులే భయభ్రాంతులకు గురిచేయడం బాధాకరమన్నారు.

ఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్నప్పటికీ సంబంధిత ఉపాధ్యాయురాలిని పాఠశాల ప్రిన్సిపాల్ వివరణ కోరలేదని వారు ఆరోపించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు అండగా ఉండి రక్షణ కల్పించాల్సిన ప్రిన్సిపాల్ తన విధుల్లో నిర్లక్ష్యం వహించడం సరైన విధానం కాదన్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవడంతో పాటు, విధుల్లో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని, పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులు కల్పించి విద్యార్థుల భద్రతకు పూర్తి భరోసా కల్పించాలని కోరారు. విద్యార్థుల రక్షణ విషయంలో ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులకు అండగా నిలుస్తామని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు